Dharani Portal | హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ పనిచేయడంలేదు. మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు నిలిచిపోయాయి. దీంతో భూ క్రయ, విక్రయాలకు అంతరాయం ఏర్పడింది. నిజానికి, కొత్తగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే వరకు ధరణి వెబ్సైట్ కూడా పని చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇందుకు విరుద్ధంగా ధరణి వెబ్సైట్ నిలిచిపోయింది. ధరణి, భూ భారతి పోర్టల్‌లు వేరువేరు అయినప్పటికీ, అర్ధాంతరంగా ధరణి సేవలు బంద్ కావడంపై రెవెన్యూ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధరణి పోర్టల్ నిలిచిపోవడానికి సాంకేతిక కారణాలే కారణమా? లేక రహస్య ఎజెండా ఏమైనా ఉన్నదా? అనే అనుమానాలను పలువురు వ్యక్తంtచేస్తున్నారు.
భూభారతి వెనుక ఉన్న పలువురు కీలక వ్యక్తులు కావాలనే ధరణి పోర్టల్‌ను బ్లాక్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. భూభారతి పోర్టల్ ప్రారంభం కావడంతో పలు భూములకు సంబంధించిన ‘లెక్కలు’ సరి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ధరణి పోర్టల్ సేవలను నిలిపేసి అందులోని భూ లెక్కలను ‘సరి చేస్తున్నట్టుగా’ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భూభారతి పైలట్ ప్రాజెక్టును ముగ్గురు కీలక మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు భూభారతి అమల్లోకి రావడం, అటు ధరణి పోర్టల్ బంద్ కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకు పని చేయడం లేదు?
వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతిని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి భూభారతి కేవలం నాలుగు మండలాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్నది. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలకు ఎలాంటి ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతో ఆ నాలుగు మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు యథాప్రకారం కొనసాగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే, ఆ మరుసటి రోజే ధరణి పోర్టల్ నిలిచిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత కూడా ధరణి సేవలు ఎందుకు నిలిచిపోయాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ధరణి పోర్టల్ వేరు. భూభారతి పోర్టల్ వేరు. అలాంటప్పుడు ధరణి పోర్టల్‌కు ఎందుకు అంతరాయం కలిగిందనేది ప్రశ్న. ధరణి పోర్టల్ సేవలు నిలిచిపోవడంపై రెవెన్యూ శాఖ నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.