భూ లావాదేవీలకు సంబంధించి ధరణి పోర్టల్ ఒక అద్భుతం. భూముల కొనుగోళ్లు, అమ్మకాలు నిమిషాల మీద పూర్తవుతయి. పావుగంటలోనే పట్టా చేతికి వస్తుంది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం కాళ్లరిగేలా ఆఫీస్‌ల చుట్టూ తిరిగే ఖర్మ ఉండది. ఒక్కసారి ధరణిలోకి భూమి ఎక్కితే రికార్డు భద్రంగా ఉంటది. ప్రపంచంలో ఎక్కడున్నా గుండెమీద చేయి వేసుకొని ఉండొచ్చు.
– సీఎం కేసీఆర్ (ధరణి పోర్టల్ ప్రారంభం సందర్భంగా)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి సంగతి.. తెలంగాణలో ఎవుసం అన్నది ఎడ్డి మాట.. భూములకు చిక్కులు చికాకులు. పాస్‌బుక్కులో ఒకపేరు.. పహాణీలో ఇంకోపేరు.. సేత్వారీలో మరోపేరు! పట్టాదారు ఒకరు.. అనుభవదారు ఇంకొకరు! ఒక కాయితంలో వ్యవసాయభూమి.. మరో కాయితంలో అటవీభూమి! దశాబ్దాల తరబడి మోఖాపై ఉన్నా.. భూమి మాత్రం సొంతం కాదు! తప్పుడు రికార్డులు.. తప్పుడు పేర్లు.. ప్రభుత్వ పథకాలు ఏవీ అందని దుస్థితి.. రైతుల అంతులేని అరిగోస!!
చీమల పుట్టలా పేరుకుపోయిన రెవెన్యూశాఖలో ముఖ్యంగా భూ సమస్యల పరిష్కారానికి పూనుకోవడం ఏ పాలకుడికైనా దుస్సాహసంగా మారిన పరిస్థితి. అలాంటి సాహసానికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేశారు. దాదాపు ఏడు దశాబ్దాల తరువాత తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. రైతుల భూములను చూసుకొనేందుకు ధరణి తల్లి వచ్చేసింది. భూముల లెక్కలు తేలిపోయినయి. అంగుళం భూమి తేడా రాకుండా పక్కాగా, ఒక బటన్ నొక్కితే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పాస్‌బుక్ పదిహేను నిమిషాల్లో చేతికి వచ్చేస్తున్నాయి. వివాదాల చిక్కు ముడులతో అస్తవ్యస్తమైన తెలంగాణ భూమి ఇప్పుడు హాయిగా నవ్వుతున్నది.
ధరణి రాకతో తెలంగాణలో కొనసాగుతున్న సరళీకృత భూపరిపాలనపై విపక్షాలు కుళ్లుకుంటున్నాయి. కచ్చితంగా భూమి లెక్కలు సాధ్యమే కాదనుకొన్న చోట.. 99 శాతం లెక్కలు తేలిపోతే.. మింగుడుపడక గగ్గోలు పెడుతున్నాయి. దుష్ప్రచారం మొదలుపెట్టాయి. ఇవేవీ పట్టని తెలంగాణ రైతు సంబురం చేసుకొంటున్నాడు. తెలంగాణ ధరణిని చూసి యావత్ దేశం ఆశ్చర్యచకితమైంది.
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): భూ రికార్డుల నిర్వహణ, లావాదేవీలకు సంబంధించి ధరణి పోర్టల్ ఓ కాంతిరేఖగా మారింది. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను అత్యంత సులభంగా, వేగంగా పూర్తి చేస్తూ కొత్త చరిత్రను లిఖించింది. శతాబ్దాల నాటి చట్టాల బూజు దులిపి.. అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్త రెవెన్యూ చట్టంలో కీలకమైంది ధరణి. ధరణి పోర్టల్‌ను 2020 అక్టోబర్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ మూడుచింతలపల్లి మండల కేంద్రంలో ప్రారంభించారు. నాటి నుంచి 20 నెలలుగా భూ లావాదేవీలు నిర్వహిస్తూ, భూ సమస్యలను పరిష్కరిస్తూ భూ బాంధవిగా మారింది.
‘ధరణిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగవు. మ్యుటేషన్ కోసం, రిజిస్ట్రేషన్ కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరిగే ఖర్మ మనకుండది. పైరవీలు చేయాల్సిన పనిలేదు. ఎక్కడా ఒక రూపాయి అవినీతి లేకుండా కొనుగోలు, అమ్మకాలు నిమిషాల మీద జరిగిపోతయి’ అని పోర్టల్ ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పినట్టే ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు కాకుండా భూముల లావాదేవీలు సాఫీగా సాగిపోతున్నాయి. అంతేకాదు.. ఒకప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకే పరిమితమైన భూ లావాదేవీలు ఇప్పుడు మండల కేంద్రాల్లో కూడా జరుగుతుండటంతో ప్రజలకు సౌలత్ లభించింది. రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లు ఉండగా.. అంతకు నాలుగు రెట్ల సంఖ్యలో 574 మండల కేంద్రాల్లో వ్యవసాయ భూముల లావాదేవీలు జరుగుతున్నాయి.
అంతకుముందంతా అస్తవ్యస్తం..
ధరణి రావడానికి ముందు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ దారుణంగా ఉండేది. ముందుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్.. ఆ తరువాత రెవెన్యూ శాఖలో మ్యుటేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకొన్నాక ఆ సేల్‌డీడ్‌తో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. చేసుకోకపోతే.. రెవెన్యూ రికార్డుల్లో పాత యజమాని పేరే ఉంటుంది. భూమి మీద పూర్తి హక్కులు రావాలంటే.. మ్యుటేషన్ జరిగి తీరాలి. మ్యుటేషన్ ప్రక్రియ ముందుగా వీఆర్వో దగ్గర మొదలై.. తాసిల్దార్.. అటునుంచి ఆర్డీవో దాకా వెళ్తుంది. ఆర్డీవో సంతకం జరిగాక కానీ పట్టాదారు పాస్ పుస్తకం వచ్చేది కాదు. ఇందుకోసం ఏండ్లూ పూండ్లూ గడిచిపోయేవి. డబ్బులు ఖర్చు చేసుకున్నా.. కాళ్లరిగేలా తిరిగినా పనులు జరిగేవి కావు.. వీఆర్వోలు చిత్తం వచ్చినట్టు పేర్లు మార్చేసి రైతులను అరిగోస పెట్టేవారు. రికార్డుల్లో పేర్లు.. విస్తీర్ణం ఇష్టం వచ్చినట్టు మారిపోయేది.
ధరణి రాకతో సమూలంగా మార్పు..
నూతన రెవెన్యూ చట్టం ద్వారా వచ్చిన ధరణితో భూ పరిపాలనలో విప్లవాత్మక మార్పు వచ్చింది. భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ బాధ్యతలు తాసిల్దార్లకు కూడా సంక్రమించాయి. రిజిస్ట్రేషన్‌తోపాటు, మ్యుటేషన్ కూడా ఏకకాలంలో జరిగిపోవాల్సిందే. ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్ అవసరం కనీసం అయింది. ఇంట్లో కూర్చున్న చోటునుంచే మునివేళ్లతోనే సగం ప్రక్రియను ముగించుకుంటే.. తరువాత పనిని తాసిల్దార్లు చిటికెలో పూర్తిచేస్తున్నారు.
బ్యాంకుకు వెళ్లి నగదు డిపాజిట్లు విత్ డ్రా చేసుకొన్న తీరుగానే.. భూ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పాస్‌బుక్ ప్రక్రియ క్షణాల్లో జరిగిపోతున్నది. ముందుగా స్లాట్ బుక్ చేసుకొని ఆ సమయానికి వెళ్తే.. పదిహేను నిమిషాల్లో పని పూర్తై ఇంటికి వచ్చేయచ్చు. ఇలాంటి పారదర్శకమైన వ్యవస్థను రద్దు చేస్తారని కాంగ్రెస్ కారుకూతలు కూస్తున్నది. బీజేపీ నేతలు అసూయ దీక్షలు చేపడతారు. దుష్ప్రచారం చేస్తున్నారు. ధరణి ఫలితాలు అందుకొన్న తెలంగాణ రైతాంగం మాత్రం ఈ ప్రేలాపనలను పట్టించుకోవడంలేదు.
పావుగంటలోనే పట్టా.. తగ్గిన ఖర్చు
గతంలో వ్యవసాయ భూముల లావాదేవీలు జరుగాలంటే ముందురోజు డాక్యుమెంట్ రైటర్ దగ్గరకు వెళ్లి డాక్యుమెంట్ రాయించుకొని, మరుసటి రోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి వేచి చూడాల్సి వచ్చేది. పొద్దున వెళ్తే సాయంత్రానికి కానీ బయటికి వచ్చేవారు కారు. ఆ తర్వాత హక్కు మార్పిడి కోసం ఆ డాక్యుమెంట్లను తీసుకొని తాసిల్దార్ ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు ఇవ్వాల్సి వచ్చేది. అంటే.. రెండు ఆఫీస్‌లకు తిరుగాల్సి వచ్చేది. రికార్డుల్లో పేరు మారడానికి నెలల సమయం పట్టేది. ఆలోగా కనీసం రెండుమూడు సార్లు ఆఫీస్ చుట్టూ తిరుగాల్సి వచ్చేది. దీంతో రైతులకు డబ్బు ఖర్చవడంతోపాటు సమయం వృథా అయ్యేది.
ఈ ఇబ్బందికి ధరణి పోర్టల్ చెక్ పెట్టింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభంగా, వేగంగా చేసింది. క్రయ, విక్రయదారులు సొంతంగా లేదా మీ సేవ కేంద్రానికి వెళ్లి సిటిజన్ లాగిన్ ద్వారా నేరుగా స్లాట్ బుక్ చేసుకొంటున్నారు. పూర్తి వివరాలను నమోదు చేయడంతోపాటు సంబంధిత పత్రాలను అక్కడే అప్లోడ్ చేస్తున్నారు. దీంతో సుమారు 60 శాతం పని పూర్తవుతున్నది. నిర్దేశిత సమయంలో ఆఫీస్‌కు వెళ్తే.. పావుగంటలోనే పట్టాతో సంతోషంతో బయటికి వస్తున్నారు. అప్పటికప్పుడే మ్యుటేషన్ జరిగి పహాణీల్లోనూ పేరు మార్పిడి జరిగిపోతున్నది. కనిష్ఠంగా 3 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయిన సందర్భాలూ ఉన్నాయి. అంతేకాదు.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులతో ఉన్న దూరంతో పోల్చితే దాదాపు సగం దూరంలోనే తాసిల్దార్ కార్యాలయం ఉండటంతో సమయం, ఇంధనం ఆదా అవుతున్నది.
ఇబ్బందులను పరిష్కరించేలా..
విధానపర లోపాలు, అవినీతి వల్ల భూముల చుట్టూ వివాదాలు, సమస్యలు పేరుకుపోయాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా ప్రయత్నిస్తున్నది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకొని, మ్యుటేషన్ చేసుకోకపోవడం వల్ల డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగేవి. వాటికి చెక్ పెట్టేందుకు పెండింగ్ మ్యుటేషన్ మాడ్యూల్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులను పరిష్కరించింది. తద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టగలిగింది. నాలా కన్వర్షన్లో ఉన్న ఇబ్బందులను సైతం పరిష్కరించింది. భూములకు సంబంధించి ఏండ్లకేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఇతర ఇబ్బందులను తీర్చేందుకు ప్రత్యేకంగా ‘గ్రీవెన్స్ మాడ్యూల్స్’ను ప్రవేశపెట్టింది. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని పరిష్కరిస్తున్నారు. ఎన్నారైల భూములకు భద్రత కల్పించేలా ప్రత్యేకంగా మాడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
రైతు బాంధవి
ధరణి సేవలు కేవలం లావాదేవీలకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని రైతులకు సంబంధించి ఏకీకృత రికార్డుగా మారింది. ప్రభుత్వం రైతులకు అందించే సేవలన్నీ ఈ వివరాల ఆధారంగానే అందిస్తున్నాయి. రైతుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాలు ఉండటంతో ప్రయోజనాలు వేగంగా అందుతున్నాయి. ధరణి రికార్డుల ఆధారంగానే ప్రభుత్వం రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో నేరుగా సాయం అందజేస్తున్నది. రైతుబీమా, ఎరువులు, విత్తనాలు, సబ్సిడీలు.. ఇలా అన్నింటికీ ధరణి వివరాలే ప్రామాణికంగా మారాయి. ఎక్కడా ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా రైతులకు ప్రయోజనాలు అందుతున్నాయి. తద్వారా పోర్టల్ రైతు బాంధవిగా నిలిచింది.
అవినీతికి చెక్ పెట్టేలా..
అవినీతికి చెక్ పెట్టేందుకు, ప్రజలకు భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేసి పోర్టల్‌లో తగిన ఏర్పాట్లు చేసింది.
శరీరంలో ఏదైనా జబ్బు చేస్తే ఎక్స్‌రే తీసి చూస్తే ఆ జబ్బేమిటో తెలుస్తుంది. దాని ద్వారా ఆ జబ్బుకు చికిత్స చేస్తాం. రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో కూడా ధరణి ఒక డయాగ్నస్టిక్ టూల్ లాంటిది. ధరణి వల్ల పాత రెవెన్యూ సమస్యలకు చెక్ పడుతున్నది. కొత్త రెవెన్యూ సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. భారత దేశ రెవెన్యూ వ్యవస్థకు ధరణి పోర్టల్ ఒక దిక్సూచి. రానున్న ఐదేండ్లలో దేశం మొత్తం ధరణి లాంటి విధానాన్ని అమలుచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సులభంగా, వేగంగా హక్కు మార్పిడి
గతంలో ఒకసారి రిజిస్ట్రేషన్‌కు, మరోసారి మ్యుటేషన్‌కు దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ధరణితో రిజిస్ట్రేషన్‌తోపాటే వెంటనే మ్యుటేషన్ జరిగిపోతున్నది. దీంతో హక్కుల మార్పిడి ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తవుతున్నది. ఇది రైతులకు ఎంతో ఊరట కల్పిస్తున్నది. ఎంతోమంది రైతులు మ్యుటేషన్ ప్రక్రియ తెల్వక రిజిస్ట్రేషన్ పత్రాలు చేతికి రాగానే లావాదేవీ పూర్తయిందని భావించేవారు. దీంతో డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగి నష్టపోయేవారు. ఇలాంటి సమస్యలకు ధరణి చెక్ పెట్టింది. మా కార్యాలయంలో రోజూ దాదాపు 20 లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తొందరగా పూర్తయిందంటూ సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు.
-అహ్మద్ హుస్సేన్, కొండపాక ఎంఆర్వో, సిద్దిపేట జిల్లా
తిరుగుడు తప్పింది
ధరణి వచ్చాక రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవస్థలు తప్పాయి. ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు కాకుండా వేగంగా, సులభంగా రిజిస్ట్రేషన్ అవుతున్నది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ ప్రవేశపెడుతున్నది.
– సిల్గురి సైదులు, పెద్దవూర ఎమ్మార్వో, నల్లగొండ జిల్లా