హైదరాబాద్, నవంబర్2 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ‘ధరణి’ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై బుధవారం నాటికి రెండేండ్లు పూర్తయ్యాయి. దీని ద్వారా ఇప్పటివరకు 26 లక్షలకుపైగా లావాదేవీలు జరిగాయి. రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాల్లేని, తప్పులు దొర్లని సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020 నవంబర్ 2న ఆన్లైన్ పోర్టల్ ‘ధరణి’ని ప్రారంభించిన విషయం విదితమే. భూ పరిపాలనలో ‘ట్రెండ్‌సెట్టర్’గా నిలిచిన ఈ పోర్టల్ రాష్ట్రంలో భూ సంబంధ లావాదేవీలకు ‘వన్ స్టాప్’ పరిష్కారాన్ని అందిస్తూ మన్ననలు పొందుతున్నది. ‘ధరణి’ ప్రారంభానికి ముందు రాష్ట్రవ్యాప్తంగా 141 ప్రాంతాల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ, నేడు రాష్ట్రంలోని 574 తాసీల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.
రిజిస్ట్రేషన్ల అనంతరం రెవెన్యూ రికార్డుల్లో ఆయా భూములకు సంబంధించిన మ్యుటేషన్లు కూడా జరిగేలా చర్యలు చేపట్టారు. అదే సమయంలో ఈ-పట్టాదార్ పాస్ పుస్తకాలను జనరేట్ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా పౌరులకు పంపుతున్నారు. దీంతో రాష్ట్రంలో భూ సంబంధ లావాదేవీలు నానాటికీ గణనీయంగా పెరగడంతోపాటు పెండింగ్‌లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు సైతం పరిష్కారమవుతున్నాయి. ఏకంగా 3.16 లక్షల భూ వివాదాలను ప్రభుత్వం పరిషరించింది. ఇప్పటివరకు 11.24 లక్షల లావాదేవీలను ధరణి ద్వారా పూర్తి చేశారు. 2.81 లక్షల గిఫ్ట్‌డీడ్‌ల రిజిస్ట్రేషన్లు చేశారు. 1.80 లక్షల మందికి సక్సెషన్ రైట్స్‌ను అందజేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1.54 కోట్ల ఎకరాల భూములకు 70 లక్షల మంది రైతుబంధు పొందుతున్నారు. ఇలా ‘ధరణి’ పోర్టల్ దేశానికే ఆదర్శంగా నిలిచింది.