హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ‘భూములతోనే మాకు బతుకు.. పచ్చని మా బతుకుల్లో విషపు కంపెనీలు పెట్టొద్దు.. ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకుంటాం’ అంటూ ఎన్‌హెచ్చార్సీ ఎదుట ధన్వాడ గ్రామస్థులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వీ రామసుబ్రమణ్యన్ సోమవారం బహిరంగ విచారణ నిర్వహించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేసిన రైతులు, గ్రామస్తులపై పోలీసులు, ప్రైవేట్ గూండాలు జరిపిన దాడిపై విచారణ జరపాలంటూ ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో 854/36/2/ 2025 నంబర్లో కేసు స్వీకరించి సోమవారం బహిరంగ విచారణకు తీసుకున్నారు. ప్రభుత్వం తరఫున హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా, లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్ సమక్షంలో కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ టీ శ్రీనివాసరావు విచారణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి కమిషన్ సేకరించింది. తమకు తెల్వకుండానే అధికారులు అనుమతులు ఇచ్చారని కమిషన్ ఎదుట బాధితురాలు మరియమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ద ధన్వాడ ప్రాంతంలో ప్రమాదకరమైన ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నట్టు సమీప 14గ్రామాల ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, నాలా కన్వర్షన్‌కు రెవెన్యూ డిపార్ట్మెంట్, విద్యుత్ కనెక్షన్‌కు టీజీఎస్పీడీసీఎల్ వంటి అన్ని వ్యవస్థలు అనుమతులు ఇచ్చినట్టు అధికారులు చెప్పారు. ఆ అనుమతులు ఎలా ఇచ్చారు? ఎవరిని అడిగి ఇచ్చారో తమకు తెలియదని బాధితులు చెప్పారు. ఈ అంశంపై బాధితుల పక్షాన ప్రముఖ శాస్త్రవేత్త బాబురావు మాట్లాడుతూ.. బాధితుల సంతకాలు లేకుండా పర్యావరణ అనుమతులు ఎలా ఇస్తారని అడిగారు. దీనిపై అధికారులను కమిషన్ వివరణ కోరింది. అన్ని రకాల అనుమతులు ఉంటే తామూ ఏం చెయ్యలేమని కమిషన్ తెలిపింది. దీంతో పోలీసులు, ప్రైవేట్ వ్యక్తులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారంటూ బాధితులు కమిషన్ దృష్టికి తెచ్చారు. గ్రామస్తుల దాడిలో తమ సిబ్బంది గాయపడ్డారంటూ పోలీసులు తెలిపారు. బాధితులపై ఎలాంటి భౌతికదాడులు జరగలేదని ఎస్పీ తెలిపారు.
రక్తంతో స్టేషన్‌కు వెళ్లినా కేసు తీసుకోలే..
న్యాయవాది రామారావు కలుగజేసుకొని బాధితురాలు మరియమ్మను తీవ్రంగా కొట్టారని, గ్రామాల్లో లేనివారి పేర్లను కూడా కేసుల్లో పెట్టారని కమిషన్‌కు చెప్పారు. బౌన్సర్లను పెట్టించి మరీ కొట్టించారని బాధితుడు పవన్పాల్ తెలిపారు. బాధితుల పక్షాన కాకుండా కంపెనీ తరఫున పోలీసులు వకాల్తా పుచ్చుకున్నారని పేర్కొన్నారు. ‘రక్తంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా, ఫిర్యాదు తీసుకోలేదని కమిషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 15 నిమిషాల పాటు విచారణ అనంతరం, కేసును నాలుగు వారాలకు వాయిదా వేశారు.
గ్రామస్థులను కూర్చొబెట్టి మాట్లాడాలి..
ఇథనాల్ పరిశ్రమపై తమ భయాలను అపోహలని అధికారులు కొట్టిపడేస్తున్నారని, కానీ వాటిపై వివరంగా చెప్పడం లేదని బాధితులు తెలిపారు. అసలు అనుమతులు వచ్చినట్టే తమ కు తెలియదని, ఇక ఎన్జీటీకి ఎలా వెళ్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే బాధితులతో చ ర్చలు జరపాలని డిమాండ్ చేశారు.