యాదగిరిగుట్ట: భక్తుల కొంగు బంగారం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ధనుర్మాస వేడుకలు (Dhanurmasa Utsavam) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుని కొలుస్తూ నెల రోజులపాటు నిర్వహించే పాశుర పఠనాలను ఆలయ అర్చకులు, పారాయణీకులు ప్రత్యేకంగా జరిపిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 4.30 నుంచి 5 గంటల వరకు శ్రీస్వామి వారి ఆలయ ముఖ మండపంపై ఉత్తర భాగంలోని హాల్లో గోదాదేవి అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతోపాటు మార్గళి నివేదన వంటి వేడుకలు జరుగనున్నాయి.
ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఆలయ నిత్య కైంకర్యాల సమయాల్లో మార్పులు చేశారు. మంగళవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు వేకువజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామివారిని మేల్కొలిపి సుప్రభాతం నిర్వహిస్తారు. అనంతరం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు తిరువారాధన, 4.30 నుంచి 5 గంటల వరకు తిరుప్పావై సేవాకాలం జరిపిస్తారు. 5 నుంచి 6 గంటల వరకు నివేదన, చాత్మర, 6 నుంచి 7 గంటల వరకు నిజాభిషేకం, 7 నుంచి 7.45 గంటల వరకు సహస్రనామార్చన, ఉదయం 7.45 నుంచి స్వామివారి సర్వదర్శనాలు ప్రారంభిస్తారు. ధునుర్మాసోత్సవాలలో భాగంగా జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదాదేవి కల్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహిస్తారు.
ఘనంగా లక్షపుష్పార్చన
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా శాస్ర్తోక్తంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. సోమవారం స్వామి, అమ్మవార్ల సహస్ర నామ పఠనంతో అర్చక బృందం, వేద పం డితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మం డపంలో ఉత్సవ మూర్తులను పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదిక పై తీర్చిదిద్దారు.
అర్చక బృందం, వేద పండితులు స్వామి, అమ్మవార్ల సహస్ర నామ పఠనంతో వివిధ రకాల పూలతో పాంచరాత్రగమశాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్షపుష్పార్చన చేశారు. తెల్లవారు జామునే ఆలయం తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వయంభూ నరసింహస్వామి వారిని మేల్కొలిపారు. తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. శ్రీస్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఆంజనేయస్వామివారికి సహస్ర నామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108 బంగారు పుష్పాల ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు. సాయంత్రం వేళలో శ్రీస్వామివారికి తిరువీధిసేవ, దర్బార్సేవ అత్యంత వైభవంగా చేపట్టారు.
రాత్రి వేళలో శ్రీస్వామివారి తిరువారాధన చేపట్టి, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు నిర్వహించారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. ఉద యం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ.20,88,907 ఆదాయం సమకూరిందని ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో వెంకట్రావు తెలిపారు.