హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ నెల 28 నుంచి 30 వరకు అన్ని రాష్ర్టాల డీజీపీల సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు, సీనియర్ అధికారులు పాల్గొంటారు. ఈ వార్షిక సమావేశంలో ప్రధానంగా ఆపరేషన్ కగార్ పురోగతి, ఉగ్రవాద దాడుల నిరోధక వ్యూహాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయని తెలిసింది.
మావోయిస్టుల లొంగుబాట్లు, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని, కేంద్ర హోంమంత్రి హాజరవుతుండటంతో సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ప్రత్యేక కమాండోలు, సీఆర్పీఎఫ్, ఎన్ఐఏ, ఐబీ బృందాలు రాయ్‌పూర్ చేరుకుని వ్యూహాత్మక భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నాయి. ఈ సమావేశానికి తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్, ఎస్ఐబీ చీఫ్ సుమతి తదితరులు హాజరుకానున్నారు. శాటిలైట్ నిఘా, డ్రోన్ పెట్రోలింగ్, గ్రౌండ్ ఆపరేషన్స్ ను మరింత సమర్థవంతంగా మార్చడంపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని అధికారవర్గాలు చెప్తున్నాయి.