మర్డర్ చేసి పారిపోయిన నిందితుని పట్టుకోవాలని ఆదేశాలు
నిందితుడి కోసం పోలీసుల గాలింపు చర్యలు
8 ప్రత్యేక బృందాల తో గాలింపు చర్యలు
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
Constable Murder | వినాయక్ నగర్, అక్టోబర్ 17 : నిజామాబాద్ సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) లో విధులు నేర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య ఘటన పై రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు సైతం సీరియస్ గా పరిగణించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలోని హైమద్ పుర కాలనీకి చెందిన షేక్ రియాజ్ అనే పాత నేరస్థుడు విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ను కత్తితో దారుణంగా పొడిచి చంపిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
చైన్స్ స్నాచింగ్, దొంగతనాలు, దాడి కేసులలో నిందితుడిగా ఉన్న పాత నేరస్తుడు రియాజ్ ను శుక్రవారం రాత్రి నగరంలోని ఖిల్లా ప్రాంతంలో పాత నేరస్థుడు ఉన్నట్లు ఉన్నతాధికారులు సూచించడంతో సిసిఎస్ ఎస్ఐ భీమ్రావు తోపాటు కానిస్టేబుల్ ప్రమోద్ నిందితుని అదుపులోకి తీసుకొని ద్విచక్ర వాహనంపై నిజామాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో వారు నగరంలోని వినాయక నగర్ ప్రాంతం వద్దకు చేరుకోగానే ద్విచక్ర వాహనంపై ఉన్న నేరస్థుడు తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ చాతి పై దారుణంగా పొడిచాడు. ఈ దాడి ఘటనలో తీవ్ర రక్తస్రావమైన కానిస్టేబుల్ రోడ్డుపై పడిపోయాడు. అనంతరం నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సీరియస్ గా పరిగణించి నిందితున్ని పట్టుకునేందుకు 8 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితుని వేటలో పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. తమ పోలీస్ కుటుంబ సభ్యుడు అయిన కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నేరస్తుని త్వరలోనే పట్టుకొని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మీడియా ముఖంగా హెచ్చరించారు.
నిందితుని ఆచూకీ ఇచ్చినవారికి రూ.50 వేలు రివార్డ్
కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారీలో ఉన్న పాత నేరస్థుడు షేక్ రియాజ్ ఆచూకీ చెప్పినవారికి పోలీస్ శాఖ తరపున 50వేల రూపాయల రివార్డ్ ఇస్తామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిందితుడు పై చాలా కేసులో ఉన్నాయని నిందితుడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే డయల్ 100 కు లేదా మీ దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇచ్చిన వారికి రూ.50 వేలు రివార్డ్ ఇస్తామని , సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నెంబర్లతో పాటు నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రకటన విడుదల చేశారు.