హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీసులు విశేష కృషి చేశారని, కోడ్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ వరకు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించినందుకు హ్యాట్సాఫ్ చెబుతున్నట్టు డీజీపీ రవిగుప్తా తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ సజావుగా, శాంతియుతంగా జరిగినట్టు వెల్లడించారు.
మావోయిస్టు ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు విసృ్తతంగా చేపట్టిన తనిఖీల వల్ల ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోలేదని తెలిపా రు. కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికలు ముగిసే వరకూ మొత్తం రూ.191కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ తెలిపారు. ఇందులో నగదు రూ.98.82 కోట్లు, రూ 10.81 కోట్ల మద్యం, రూ.7.11 కోట్ల డ్రగ్స్, రూ.62.77 కోట్ల ఆభరణాలు, రూ.11.65 కోట్ల విలువైన ఉచితాలు ఉన్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో స్టేట్ నోడల్ ఆఫీసర్స్ ఏడీజీలు సంజయ్ కుమార్ జైన్, మహేశ్ భగవత్ పాల్గొన్నారు.