హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): పోక్సో నేరాలు, లైంగిక దాడులకు వన్‌స్టాప్ సెంటర్లుగా భరోసా కేంద్రాలు నిలిచాయని డీజీపీ రవిగుప్తా, రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖా గోయల్ చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మరో 8 భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. మం గళవారం భద్రాది-కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, మంచిర్యాల, ములుగు, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లో భరోసా కేంద్రాలతోపాటు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ వెబ్‌సైట్‌ను వారు వర్చువల్‌గా ప్రారంభించారు.
అనంతరం డీజీపీ మాట్లాడుతూ 2013లో తెలంగాణలో ఏర్పాటైన భరోసా కేంద్రాల ద్వారా ఎంతోమంది మహిళలు, చిన్నారులు లద్ధి పొందారని వివరించారు. నాటి నుంచి నేటి వరకు 4,782 పోక్సో కేసులు 1,163 రేప్ కేసుల్లో బాధితులకు మద్దతివ్వడంతోపాటు నిందితులకు శిక్షలు పడేలా భరోసా కేంద్రాలు విశేష చొరవ తీసుకున్నాయని వివరించారు.