హైదరాబాద్ సిటీబ్యూరో/నాంపల్లి కోర్టులు, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అరెస్టయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వారిద్దరినీ రెండోరోజు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. వీరితోపాటు గతంలో టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేసిన కొందరు ఎస్సైలు, సీఐలనూ విచారిస్తున్నారు. ఎస్ఐబీలో పనిచేసే సిబ్బందినీ విచారిస్తున్నారు.
తాజాగా నలుగురు సిబ్బంది వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ కేసులో నిందితులపై టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్లను జత చేసేందుకు సోమవారం కోర్టులో వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగానే నిందితుల తరపున న్యాయవాదులకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. కోర్టు అనుమతిస్తే దేశంలో మొదటిసారి ఈ చట్టం ఈ కేసులో అమలు చేసినట్లవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు సోమవారం కోర్టును కోరే అవకాశం ఉన్నది.