హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఎన్కౌంటర్లో మృతిచెందిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. రియాజ్ ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు తమను వేధిస్తున్నారని, స్వగ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మృతుడి తల్లి, భార్య, పిల్లలు కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్‌కు ఫిర్యాదు చేశారు.
ఓ కేసు విషయంలో ప్రమోద్ రూ.3 లక్షలు డిమాండ్ చేయడంతో తన భర్త అప్పటికప్పుడు రూ.30 వేలు చెల్లించాడని, ఆ తర్వాత మిగతా డబ్బులు ఇవ్వాలంటూ ప్రమోద్ తన భర్తను తీవ్రంగా వేధించాడని రియాజ్ భార్య ఆరోపించారు. కాగా, రియాజ్ ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఇప్పటికే సుమోటోగా కేసు స్వీకరించింది. సమగ్ర నివేదికను నవంబర్ 24లోగా సమర్పించాలని జస్టిస్ షమీమ్ అక్తర్ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. తాజాగా రియాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నివేదిక సమర్పణ గడువును తగ్గించారు. వచ్చే నెల 3లోగా నివేదికను సమర్పించాలని డీజీపీని ఆదేశించారు.