హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని వర్సిటీల వీసీలతో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నకిలీ సర్టిఫికెట్ల నివారణకు డీజీపీ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ సర్టిఫికెట్లు గుర్తించేందుకు పోర్టల్ రూపొందించామని తెలిపారు. ఈ వ్యవస్థను ఉన్నత విద్యామండలితో కలిసి సిద్ధం చేశామన్నారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్సిటీలు జారీ చేసే అన్ని సర్టిఫికెట్లను పోర్టల్లో నమోదు చేస్తామని చెప్పారు. ప్రతి సర్టిఫికెట్ అసలుదో, నకిలీదో తెలుసుకునేలా పోర్టల్ రూపొందించామని స్పష్టం చేశారు.
అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. నకిలీ సర్టిఫికెట్ల నిర్మూలనకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని పేర్కొన్నారు. 2010 నాటి నుంచి అన్ని సర్టిఫికెట్లను పోర్టల్లో నమోదు చేశామని తెలిపారు. పోర్టల్లో అందరి సర్టిఫికెట్లు అప్లోడ్ చేశామని చెప్పారు. ఆయా కంపెనీలు ఉద్యోగుల సర్టిఫికెట్లను పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు అని ప్రొఫెసర్ లింబాద్రి సూచించారు.