హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : నేరస్థులకు శిక్షలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ న్యాయ సూత్రాలను పాటిస్తూ మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్రమైన నేరాలను గుర్తించి వాటి దర్యాప్తు, శిక్షల పర్యవేక్షణకు దృఢమైన వ్యవస్థను అనుసరిస్తున్నట్టు వెల్లడించారు. గత ఐదేండ్లుగా విచారణలో కేసులకు సంబంధించి శిక్షలు పడినట్టు డీజీపీ తెలిపారు. అత్యాచారం, పోక్సో కేసుల్లో 15 మందికి 20 ఏండ్లు, మరో రెండు కేసుల్లో ఇద్దరికి 25 ఏండ్లు, 11 మందికి జీవిత ఖైదువిధించినట్టు వెల్లడించారు. హైదరాబాద్, రాచకొండలో కమిషనరేట్ల పరిధిలో ఐదు చొప్పున శిక్షలు విధించినట్టు తెలిపారు.
ఆ కఠినాత్ములకు జీవితఖైదు..
‘హైదరాబాద్లో ఓ కసాయి తండ్రి తన కూతురిపై అనేకసార్లు లైంగికదాడి చేసినందుకు అతనికి జీవితఖైదు పడింది. మరో కేసులో తన కూతురిపై లైంగికదాడి చేసిన తండ్రికి 25 ఏండ్ల శిక్ష, ఆదిలాబాద్లో ఓ బాలుడిపై అసహజ లైంగిక నేరం చేసిన నిందితుడికి 20 ఏండ్ల శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించారు. 2017లో నార్సింగి పోలీస్ స్టేషన్ చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడికి ఎంఎస్జే కోర్టు తాజాగా మరణశిక్ష పడినట్టు డీజీపీ వివరించారు.