హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ వెల్లడించారు. శనివారం నిమజ్జన కార్యక్రమాన్ని డీజీపీ తన కార్యాలయం నుంచి సమీక్షించారు. అనంతరం శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్ ఎం భగవత్, పీఅండ్ఎల్ ఐజీ ఎం రమేశ్, శాంతిభద్రతల ఏఐజీ రమణ కుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముందస్తుగానే అన్ని ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుచేశామని, సీనియర్ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం మధ్యాహ్నం 2 గంటల లోపే పూర్తయిందని, ఆదివారం మధ్యాహ్నం వరకూ విగ్రహాల తాకిడి ఉంటుందని, మొత్తం 1.60 లక్షల విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకుంటాయని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 45వేల మందికిపైగా సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భద్రతా ఏర్పాట్లలో పోలీసులతోపాటు ఎక్సైజ్, ఫారెస్ట్, ఆర్పీఎఫ్, టీజీఎస్పీ బెటాలియన్స్, అగ్నిమమాపకశాఖల సిబ్బంది కూడా పాల్గొన్నట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 94 ఫైర్ రెస్క్యూ టెండర్లు, డీఎఫ్ఓ నుంచి హోంగార్డుల వరకు 527 మంది సిబ్బంది విధులు నిర్వహించినట్టు ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు.