హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ‘ప్రజల ఫిర్యాదులపై తక్షణం ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి.. ఆ తర్వాత విచారణలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని చట్టపరంగా శిక్షించే అవకాశం ఉంటుంది.. ఎఫ్ఐఆర్ల నమోదులో జాప్యంచేస్తే ఆశించిన ఫలితాలు రావు’ అని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల (ఎస్‌హెచ్‌వో)కు డీజీపీ జితేందర్ హితబోధ చేశారు. నేరస్తుడికి శిక్ష పడినప్పుడే మరొకరికి తప్పు చేయాలనే ఆలోచన రాదని తెలిపారు. శనివారం తన కార్యాలయంలో వివిధ జిల్లాల పరిధిలోని ఎస్‌హెచ్‌వోలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్‌హెచ్‌వోలు నిబద్ధతతో పనిచేయాలని, పోలీసు సిబ్బంది ఉన్నది ప్రజల కోసమేననే విషయాన్ని గుర్తుపెట్టుకొని, ప్రజల శాంతి భద్రతలను కాపాడాలని ఆదేశించారు. ప్రజల ఆకా ంక్షలకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. క్యూఆర్ కోడ్ ద్వారా పోలీస్ సిబ్బంది పనితీరును అంచనా వేస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు.
ట్రాఫిక్ విభాగంలో చలాన్ల వసూళ్ల కోసం క్యాష్ లెస్ పద్ధతి అమల్లోకి తెచ్చిన తర్వాత సిబ్బందిపై ఆరోపణలు తగ్గాయని చెప్పారు. శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ ఎం భగవత్ మాట్లాడుతూ వ్యవసాయ పనులు వేగంగా జరుగుతున్నందున నకిలీ విత్తనాల అమ్మకాలపై, ఉత్పత్తిదారులపై నిఘా పెట్టాలని ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి నిందితులను శిక్షించాలని కోరారు. సమావేశంలో శాంతిభద్రతల ఏఐజీ రమణకుమార్, డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.