హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : మహిళల విజయంలో కుటుంబసభ్యుల పాత్ర అత్యంత కీలకమని, కుటుంబ ప్రోత్సాహం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ, వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో శనివారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ‘స్త్రీ రైడ్-ఉమెన్ డ్రైవర్స్ ఇనిషియేటివ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మహిళలకు భద్రత, సాధికారత, ఆర్థిక స్వాతంత్య్రం, ఉపాధి అవకాశాలు కల్పించడంతో సమాజంలో వారు ఉన్నతస్థాయికి చేరవచ్చని తెలిపారు.
మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రొఫెషనల్ డ్రైవర్లుగా పనిచేయడానికి సిద్ధపడటం సంతోషకరమని పేర్కొన్నారు. మహిళలకు పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మరింత ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. దేశ రక్షణలో మహిళలు ఇప్పటికే ఫైటర్ పైలట్లుగా సేవలు అందిస్తున్నారని, అదే స్ఫూర్తితో రవాణా, సేవ, ఉత్పత్తి రంగాల్లో మరింత భాగస్వాములు కావాలని డీజీపీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం తొలి దశలో 50 మంది బైక్ రైడర్లు, నలుగురు ఆటో డ్రైవర్లు, ఒక క్యాబ్ డ్రైవర్‌కు ప్రత్యేక శిక్షణ అందించారు. బస్, రైల్వే స్టేషన్లు, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు మరింత సురక్షితమైన రవాణా సేవలు అందించడంలో మహిళా డ్రైవర్లు కీలకపాత్ర పోషించగలరని ఎంఏడబ్ల్యూవో సీఈవో జైభారతి తెలిపారు.