ములుగు, ఫ్పిల్ 7 (నమస్తే తెలంగాణ): తీవ్రవాద ప్రాంతాల అభివృద్ధికి పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కృషిచేయనున్నట్టు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలం పామునూరు శివారులో ఉన్న కర్రెగుట్టల్లో అటవీశాఖ పీసీసీఎఫ్ సీహెచ్ సువర్ణ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ ఏడీజీపీ డాక్టర్ అనిల్‌కుమార్, సీఆర్పీఎఫ్ ఐజీపీ టీ విక్రమ్, ఎస్ఐబీ ఐజీపీ సుమతి, అటవీశాఖ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ డాక్టర్ వీ ప్రభాకర్‌తో కలిసి పర్యటించారు. పామునూరు వద్ద ఏర్పాటు చేయనున్న ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ పనులతోపాటు పోలీస్ ఔట్‌పోస్ట్, ఫారెస్ట్ వాచ్‌టవర్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మురుమూరు రాష్ట్ర రహదారి నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టామని, త్వరలో పూర్తిచేసి పామునూరు మీదుగా బీజాపూర్‌కు అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. పీసీసీఎఫ్ సువర్ణ మాట్లాడుతూ.. అటవీ చట్టాలను అతిక్రమించకుండా రోడ్డుపనులను పూర్తి చేశామని తెలిపారు. అనంతరం పామునూరుకు చెందిన ఏడు కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఆటోతోపాటు బైక్‌ను అందజేశారు. వెంకటాపురానికి చేరుకొని ములుగు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’లో భాగంగా ఏర్పాటుచేసిన కంటివైద్య శిబిరాన్ని సందర్శించారు.