Telangana | హైదరాబాద్ : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పోలీసుల క్రీడల్లో తెలంగాణ పోలీసులు( Telangana Police ) సత్తా చాటుతున్నారని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని పతకాలు రాష్ర్టానికి అందించాలని డీజీపీ అంజనీ కుమార్( DGP Anjani Kumar ) ఆకాంక్షించారు. రిటైర్డ్ ఎస్పీ మహ్మద్ ఖాసీం( MD Khasim ) తన సర్వీసులో సాధించిన 16 పతకాలను డీజీపీ అంజనీ కుమార్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆధ్వర్యంలో పోలీస్ మ్యూజియానికి( Police Museum ) బహూకరించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ( Telangana State Police Academy )లో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి డీజీపీ అంజనీకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
యువ పోలీస్ అధికారులు తమ శరీర ధారుడ్యాన్ని కాపాడుకుంటూ క్రీడా పోటీల్లో పాల్గొని శాఖకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీస్ అధికారిగా ఒక వైపు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూనే, మరోవైపు జాతీయ, అంతర్జాతీయ పోలీస్ క్రీడా పోటీల్లో ఖాసీం రాణించి, అనేక పతకాలు సాధించడం గొప్ప విషయమని అన్నారు. ప్రస్తుత యువ పోలీస్ అధికారులకు ఖాసీం ఆదార్శప్రాయుడని సూచించారు. తన మెడల్స్‌ను పోలీస్ శాఖ మ్యూజియానికి బహూకరించడంతో మ్యూజియం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని డీజీపీ తెలిపారు. పర్వతారోహణలో నిష్ణాతులైన ఐజీ తరుణ్ జోషి( IG Tarun Joshi ) త్వరలోనే మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించనున్నట్లు డీజీపీ వెల్లడించారు. డీఐజీ రమేష్ రెడ్డి( DIG Ramesh Reddy ) కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే మారథాన్లలో పాల్గొననున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఎస్పీ ఖాసీం మాట్లాడుతూ.. తాను విధినిర్వహణలో ఉంటూనే క్రీడల్లో పాల్గొనడానికి పోలీస్ శాఖ ఎంతో సహకారం అందించిందని గుర్తు చేశారు. తన సర్వీసులో అల్ ఇండియా పోలీస్ మీట్, అల్ ఇండియా ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్, అల్ ఇండియా పోలీస్ గేమ్స్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కౌన్సిల్ మీట్లలో పాల్గొని 10 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్ మెడల్స్ సాధించానన్నారు. తాను సాధించిన ప్రతిష్టాత్మకమైన మెడల్స్ యువ పోలీస్ అధికారులకు స్ఫూర్తినిస్తాయనే ఉద్దేశంతోనే వాటిని పోలీస్ శాఖకు బహూకరించానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీలు అభిలాష బిస్త్, షిఖా గోయెల్, ఎస్.కె.జైన్, ఐజీలు కమలహాసన్ రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, తరుణ్ జోషి, డీఐజీ రమేష్ రెడ్డి, అకాడమీ డీడీ అనసూయ, పలువురు పోలీస్ అధికారులు హాజరయ్యారు.