హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అండర్ ఇన్వెస్టిగేషన్ (యూఐ) పెండెన్సీ కేసులు వరుసగా 16వ నెలలోనూ నియంత్రణలో ఉండటం సంతృప్తిని ఇచ్చిందని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. సంగారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, రామగుండం కమిషనరేట్‌లో అత్యధికంగా యూఐ కేసులు నమోదయ్యాయని, రాచకొండ కమిషనరేట్ పరిధిలో తీవ్రమైన నేరాలకు సంబంధించి శిక్షల రేటులో గణనీయ పురోగతిని కనిపించిందని పేర్కొన్నారు.
కేసులను అత్యధికంగా పరిషరించడంలో అత్యుత్తమంగా పనిచేసిన రామగుండం యూనిట్‌ను ప్రశంసించారు. పెండింగ్ కేసులను త్వరగా క్లియర్ చేయడంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు రివార్డులు అందజేస్తామని ప్రటించారు. వ్యవస్థీకృత దోపిడీలు, సంప్రదాయ నేరాలు తగ్గుముఖం పడుతున్నాయని, హైదరాబాద్ శివార్లలో ఇలాంటి నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర యాంటీ నారోటిక్స్ బ్యూరో, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు ప్రభుత్వం చాలా ప్రాముఖ్యత ఇచ్చిందని, ఈ రెండు బ్యూరోలు సమర్థంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్, ఐజీలు షానవాజ్ ఖాసీం, చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీలు విశ్వజిత్ కాంపాటి, ఆర్ వెంకటేశ్వర్లు, ఇతర ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.