హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీలోని తాను చదువుకున్న కిరోరిమల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు కాలేకపోతున్నానంటూ డీజీపీ అంజనీకుమార్ తన బ్యాచ్‌మేట్స్‌కు ఆడియో సందేశం పంపారు. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దినేశ్ కట్టర్ డీజీపీకి ఆహ్వానం పలుకగా.. బాధ్యతాయుతమైన విధినిర్వహణలో భాగంగా పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి రాలేకపోతున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా కిరోరిమల్ కాలేజీ పూర్వ, ప్రస్తుత విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆడియో సందేశంలో డీజీపీ తన కాలేజ్ డేస్‌ను గుర్తుచేసుకొన్నారు. చదువు చెప్పిన అధ్యాపకులు, తోటి విద్యార్థులతో చేసిన అల్లరి.. సాధారణ విద్యార్థిగా అడుగుపెట్టి, ఉన్నత చదువులు చదివి ఓ రాష్ర్టానికి అత్యున్నత పోలీస్ పదవికి చేరుకొన్న తీరును వివరించారు. విద్యార్థులంతా ఓ లక్ష్యం ఏర్పాటు చేసుకొని, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.