హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిన మానవ అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటంలో దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని డీజీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీసు మహిళాభద్రతా విభాగం, బచ్పన్ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థతో కలిసి మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్జేపీయూలు, ఏహెచ్టీయూలు, ఏఎల్వోలు, సీడబ్ల్యూసీ, డీసీపీయూలు, ఎన్జీవోలతో కలిసి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్-రెస్యూ, రిహాబిలిటేషన్ అనే అంశపై సదస్సును నిర్వహించింది. తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా డీజీపీ అంజనీకుమార్ హాజరయ్యారు.
నోడల్ ఏజెన్సీగా ఉమెన్ సేఫ్టీ వింగ్
మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి నిర్వహించే అన్ని కార్యకలాపాలకు సంబంధించి రాష్ట్రంలో మహిళాభద్రతా విభాగం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నదని రాష్ట్ర ఉమెన్ సేఫ్టీవింగ్ అడిషనల్ డీజీ శిఖా గోయెల్ పేరొన్నారు. అన్ని జిల్లాల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు యాక్టివ్గా పనిచేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని ఆమె తెలిపారు. సదస్సులో తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సీఐడీ విభాగం అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఎన్డీఆర్ఎఫ్ రిటైర్డ్ డీజీ డాక్టర్ పీఎం నాయర్, మహిళాభద్రతా విభాగం ఎస్పీ పీవీ పద్మజ, అడిషనల్ ఎస్పీ అశోక్ తదితరులు పలు అంశాలపై ప్రసంగించారు.