హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ స్టార్టప్ ‘మారుత్’ రూపొందించిన బహుళ ప్రయోజనకర (మల్టీ యుటిలిటీ) వ్యవసాయ డ్రోన్ ఏజీ-365కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి సర్టిఫికేషన్ లభించిందని ఆ సార్టప్ వ్యవస్థాపకుడు ప్రేమ్‌కుమార్ వెల్లడించారు. దేశంలోనే తొలిసారి వ్యవసాయ పనుల కోసం రూపొందించిన ఈ డ్రోన్ పనితీరును ఇప్పటికే పలుమార్లు క్షేత్రస్థాయిలో పరీక్షించామని, ఐదు వ్యవసాయ వర్సిటీలు శాస్త్రీయంగా దీన్ని పరీక్షించాయని పేర్కొన్నారు. 10 లీటర్ల ట్యాంకును కలిగి ఉండి రోజుకు 25 నుంచి 30 ఎకరాల్లో పురుగు మందులను పిచికారీ చేయగలిగే ఈ డ్రోన్‌ను ఒకసారి చార్జింగ్ చేస్తే 3 మూడు ఎకరాల్లో పని పూర్తి చేస్తుందని, కేవలం 5 నిమిషాల్లోనే ఎకరం పొలంలో పిచికారీ చేయగలదని వివరించారు. పురుగు మందులతోపాటు ఎరువులను చల్లేందుకు, పంట ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు ఉపయోగించుకోవచ్చని ప్రేమ్‌కుమార్ తెలిపారు.
హైదరాబాద్ సార్టప్ మారుత్ డ్రోన్స్ రూపొందించిన వ్యవసాయ డ్రోన్ ఏజీ 365కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నుంచి సర్టిఫికేషన్ లభించడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. మారుత్ డ్రోన్స్ స్టార్టప్ రూపొందించిన ఏజీ 365కు డీజీసీఎ నుంచి సర్టిఫికెట్ రావడం పట్ల టీహబ్ ప్రతినిధులు ట్విట్టర్లో ప్రత్యేకంగా ప్రశంసించారు.