హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. తెలంగాణలో 189 కేసుల్లో వీరి ప్రమేయం ఉండగా, మొత్తం రూ.9 కోట్లు వీరు బాధితుల నుంచి లూటీ చేసినట్టు ఆమె తెలిపారు. ఈ ఏడుగురిపై దేశవ్యాప్తంగా 2,223 కేసులున్నట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో శిఖాగోయెల్ పేర్కొన్నారు. అనేక మ్యూల్ ఖాతాలను తెరవడం, వాటిని నిర్వహించడంలో వీరి పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు.
నిందితులను సౌరభ్ సింగ్ రాయ్, దేవేంద్ర కుమార్ సరన్, రాహుల్ వైష్ణవ్, నితిన్ సిసోడియా, నవీన్ కుమార్, కులదీప్మీనా, సాహిల్ ఖాన్‌గా పేర్కొన్నారు. ఇందులో ఇద్దరు విద్యార్థులుగా గుర్తించారు. నిందితుల నుంచి 9 సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఒక థార్(ఫోర్ వీలర్), రూ.97,000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గత సెప్టెంబర్‌లో 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసిన తర్వాత రాజస్థాన్‌లో చేసిన రెండో ఆపరేషన్ ఇది. ఈ కేసులో 27 మ్యూల్ ఖాతాలు నిర్వహిస్తున్న నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. సీఎస్బీ ఎస్పీ దేవేంద్ర సింగ్ నేతృత్వంలోని డీఎస్పీ సూర్య ప్రకాశ్ టీమ్‌ను శిఖాగోయెల్ అభినందించారు.