
ఆధ్యాత్మికంగా తెలంగాణలో ఒక మహిమాన్విత దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ చరిత్రలో మున్నెన్నడూ
కనని, వినని విధంగా చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న అనేక ఆలయాలకు ఇప్పుడు మహాయోగం లభించింది. తెలంగాణకు శిరోరత్నంగా పంచనారసింహ క్షేత్రం యాదాద్రి భాసిల్లుతున్నది. సోమవారం నాడే యాదాద్రి పవిత్ర ధ్వజస్తంభ దారుకు శాస్ర్తోక్తంగా పూజలు జరిగాయి. ఒక్క యాదాద్రి ఏమిటి.. బాసర, వేములవాడ, ధర్మపురి, వరంగల్ భద్రకాళి, రామప్ప, వేయిస్తంభాల గుడి, జోగులాంబ,
ఏడుపాయల, మేడారం, ఉజ్జయిని మహంకాళి.. రాష్ట్రంలో భక్తి సుగంధాలను వెదజల్లుతున్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఏడేండ్లు.. రూ.2,055 కోట్లు! ఇది రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, పురాతన ఆలయాల పునరుద్ధరణ, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన మొత్తం. దైవభక్తి పరాయణుడు, ధార్మిక కార్యక్రమాల పట్ల అనురక్తి ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆధ్యాత్మికరంగానికి ఎంతటి మేలు జరుగుతుందో ఈ ఏడేండ్ల చరిత్ర నిరూపిస్తున్నది. తీవ్ర నిరాదరణ, నిర్లక్ష్యానికి గురైన దేవాదాయ, ధర్మాదాయశాఖ స్వరాష్ట్రంలో కొత్త వైభవం సంతరించుకొన్నది. శిథిలావస్థకు చేరిన అనేక చారిత్రక, పురాతన ఆలయాల్లో నిత్యం గుడిగంటలు మోగుతున్నాయి. ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,645 ఆలయాల్లో కొలువైన దేవతలు నిత్యపూజలు అందుకొంటూ, రాష్ర్టాన్ని సుభిక్షంగా కాపాడుతున్నారు. యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, ధర్మపురి తదితర ప్రసిద్ధ క్షేత్రాలకు ప్రభుత్వం ఇతోధికంగా నిధులు కేటాయించి, వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నది. కృష్ణ, గోదావరి, తుంగభద్ర పుష్కరాలను అ త్యంత వైభవంగా నిర్వహించి, ఆధ్యాత్మిక ప్రపంచం లో తెలంగాణ కీర్తిని సమోన్నతంగా నిలబెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. బోనాల పండుగతోపాటు మేడారం తదితర జాతరలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నది. సమైక్య రాష్ట్రంలో అవస్థలుపడ్డ అర్చకులు, ఆలయ ఉ ద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు అం దజేస్తూ వారిని గౌరవిస్తున్నది.
ప్రముఖ దేవాలయంగా యాదాద్రి…
దేశంలోని మరే ఇతర దేవాలయంతో సరిపోల్చలేని విధంగా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దారు. దాదాపు 40వేల మంది భక్తులకు సరిపడా అత్యంత ప్రణాళికాబద్ధంగా వసతులు ఏర్పాటుచేశారు. ప్రధా ని, రాష్ట్రపతిసహా వీవీఐపీలతోపాటు సామాన్య భక్తులకు సైతం తగిన ఏర్పాట్లు చేశారు. రోడ్లు, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. దశాబ్దాల కాలంపాటు నిర్మించే ఆలయాన్ని కేవలం ఐదేండ్లలోనే నిర్మించడం ఒక విశేషమైతే, ప్రస్తుత ఆధునిక యుగంలో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ దాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు సీఎం కేసీఆర్ చేసిన అత్యంత గొప్ప ప్రయత్నంగా చెప్పవచ్చు. ఆలయ విశేషాలు ఒకటీ-రెండూ కావు. చినజీయర్ స్వామి ఆశీస్సులు, సూచనలు, సలహాల మేరకు ప్రతి అంశంలోనూ ఎం తో జాగ్రత్త వహిస్తూ స్వయంగా సీఎం కేసీఆర్ పనులను పర్యవేక్షిస్తూ ఈ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించారు. యాదాద్రి తరహాలో మరిన్ని ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
పుష్కరాలు, జాతరలు, బోనాల కోసం 76.19 కోట్లు


కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి
సీఎం కేసీఆర్ స్వతహాగా దైవభక్తి, ఆధ్యాత్మిక విలువలున్న వ్యక్తి కావడంతో దైవ సంబంధమైన అంశాలు, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో వాటి అభివృద్ధికి పాటుపడుతున్నారు. సమైక్యపాలనలో నిర్లక్ష్యానికి గురైన అనేక పురాతన, చారిత్రక ఆలయాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామీణ ఆలయాల్లో సైతం ధూప, దీప, నైవేద్యం నిత్యం జరిగేవిధంగా చూస్తున్నారు.
-ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి రాబట్టేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ చేపట్టిన చర్యలు ఫలితాలిస్తున్నా యి. పది ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 2,622 ఎకరాల భూమికి ఆక్రమణదారుల చెర నుంచి విముక్తి కల్పించారు. దేవాదాయశాఖ పరిధిలోని వివిధ ఆలయాల కింద మొత్తం 87,235.39 ఎకరాల భూమి ఉండగా, అందులో 20,124.03 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఇందులో పది వేల ఎకరాల విషయంలో కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అన్యాక్రాంతమైన భూములను గుర్తించేందుకు దేవాదాయశాఖ రెండేండ్లుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నది. జిల్లాలవారీగా అన్యాక్రా ంతమైన భూములు, భూముల్లో ఏర్పడ్డ కాలనీలు, బస్తీలు, ఇతర నిర్మాణాల జాబితాను ప్రభుత్వానికి పంపించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఆలయ భూ ములను ఎన్నేండ్లుగా అనుభవించినా ఆక్రమణదారుల సొంతమయ్యే అవకాశంలేదని అధికారులు తెలిపారు.
తెలంగాణలో పరిమళిస్తున్న ఆధ్యాత్మికం
రాష్ట్రంలోని 36 ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ పూజలు, సేవలు, వసతి కోసం బుకింగ్ సౌకర్యం ప్రవేశపెట్టింది.
సేవలను విస్తరించే లక్ష్యంతో దేశంలో ఎక్కడినుంచైనా సేవలు పొందేందుకు పోస్టల్‌శాఖతో ఒప్పందం కుదుర్చుకొన్నది.
ముఖ్యమైన ఆలయాల్లో బెల్లంతో తయారుచేసిన కొత్త ప్రసాదాలు, ప్రత్యేకమైన ప్రసాదాలు భక్తులకు అందజేస్తున్నారు. ప్రసాదం తయారీలో ఆటోమేషన్ ప్రక్రియను ఉపయోగిస్తున్నారు.
ఆలయాల వద్ద షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, ఆలయ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ధూప,దీప, నైవేద్య పథకం(డీడీఎన్ఎస్)కింద రూ.118 కోట్లు
అర్చకులకు జీవనభృతి కల్పించడంతోపాటు పూజలకు నోచుకోని దేవాలయాల్లో నిత్య పూజలు నిర్వహించడం కోసం ధూప, దీప నైవేద్య పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకం కింద గడిచిన ఏడేండ్లలో రూ.118 కోట్లు ఖర్చు చేసింది. 3,645 దేవాలయాలకు ప్రతి నెలా రూ.6,000 చొప్పున చెల్లిస్తున్నది.
పురాతన ఆలయాల పునరుద్ధరణకు రూ.144.44 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ పథకం కింద పురాతన, శిథిలావస్థకు చేరిన ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్నది. ఈ పథకం కింద 2016-17 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.79.32 కోట్లతో 324 పనులను పూర్తిచేశారు. మరో రూ.65.12 కోట్లతో 387 పనులు కొనసాగుతున్నాయి. ఇంకా 807 పనులను గ్రౌండింగ్ చేయాల్సి ఉన్నది.
అర్చకులు, ఉద్యోగుల వేతనాలకు రూ. 279.45 కోట్లు
అర్చకులు, దేవాలయ ఉద్యోగులకు 2017 నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. 1,201 మంది అర్చకులు, 1,466 మంది ఇతర ఉద్యోగులు కలిపి 2,667 మంది ప్రయోజనం పొందుతున్నారు. 2017 నుంచి ఇప్పటివరకు వేతనాల కోసం రూ. 279.45 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
