యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 23 : మహిమాన్విత యాదగిరికొండపై పంచనారసింహుడిగా కొలువైన దేవదేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్తజనులను అలరించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం నిత్యపూజ కైంకర్యాల అనంతరం స్వామివారికి మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార సేవలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి పశ్చిమ రాజగోపురం గుండా ఉత్తరం, తూర్పు, దక్షిణ మాడ వీధుల్లో ఊరేగించారు. పట్టువస్ర్తాలు, బంగారు, వజ్రాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్యమంగళకరంగా అలంకరించిన స్వామివారిని పశ్చిమ దిశలో గల వేంచేపు మండపంలో అధిష్ఠింపజేసి సేవించి తరించారు.
రాత్రి స్వామివారు శేషవాహన సేవలో తిరుమాడవీధుల్లో ఊరేగారు. అనంతరం లక్ష్మీనారసింహుడు శేషవాహన సేవలు అందుకున్నారు. ఈ వేడుకల్లో కలెక్టర్ పమేలా సత్పతి, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీత, ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా ఉత్తర మాడవీధుల్లోని రథశాల ముందు వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉమామహేశ్వరి బృందంలో వంద మంది కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన, టీకే సిస్టర్స్ (డాక్టర్ టీకే సరోజ, డాక్టర్ టీకే సుజాత) కర్ణాటక గాత్ర కచేరి, శ్రీసాయి బృందంతో మోర్సింగ్ వాయిద్య కచేరి కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగాయి.