శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుండే కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ర్టాల నుండి స్పర్శ దర్శనం కోసం వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునుండి క్యూలైన్లలో బారులుతీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్వామిఅమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. భక్తులు దర్శన వేళల్లో ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ అధికారులు చెప్పారు.
తెల్లవారుజామున ఆచరించే నదిస్నానాలను పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. క్యూలైన్లలో దర్శనానికి వేచిఉండే భక్తులకు పాలు, మంచీనీరు, అల్పాహార పొట్లాలు అందిస్తున్నట్లు పీఆర్ఓ శ్రీనివాసరావు తెలిపారు. విద్యుద్దీప కాంతులతో అలరారుతున్న ఆలయ శోభను వీక్షిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులవుతున్నారు. క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తునికి స్వామిఅమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నట్లు ఈవో లవన్న తెలిపారు.