హైదరాబాద్: మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కంటికి జలాభిషేకం చేసి పత్రి సమర్పిస్తున్నారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. లింగమయ్య దర్శనం కోసం క్యూలైన్లలో బారులుతీరారు. ఓం నమఃశివాయ్య పంచాక్షరీ మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
వేమువాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అర్ధనారీశ్వరుడి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతున్నది. ఆలయ అర్చకులు వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి అద్దాల మండపంలో అనువంశిక అర్చకులతో మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహిస్తారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. వేయిస్తంభాల గుడిలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి శోభ నెలకొంది. కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో మూడు రోజులపాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం 4.35 గంటలకు శ్రీ శుభానంద ముక్తీశ్వర స్వామి కల్యాణోత్సవం జరుగనుంది. రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ జరుగుతుంది. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు కాళేశ్వరానికి తరలివస్తున్నారు. దీంతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజామాబా జిల్లాలోని కంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కంఠేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు.
హైదరాబాద్ శివార్లలోని కీసరకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా తరలివస్తున్నారు. నగరంలోని పంజాగుట్టలో ఉన్న దుర్గా భవానీ ఆలయంలో.. దుర్గమల్లేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు అభిషేకంలో పాల్గొన్నారు. హర హర శంభో.. శివ శివ శంభో అంటూ భక్తులు శివలింగానికి అభిషేకం నిర్వహించారు. మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ.. రుద్రపాఠనం నిర్వహించారు. ఇవాళ రాత్రి శివపార్వతుల కళ్యాణం నిర్వహించనున్నారు. ఓం నమ శివాయ అంటూ భక్తులు పరవశంతో పలికారు. దుర్గామల్లేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని చంద్రమౌళీశ్వర ఆలయంలో వేకువజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని తీర్ధాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి తొలి అభిషేకం నిర్వహించిన అనంతరం లాంచరంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి అభిషేక పూజలో మండల తాసిల్దార్ పి రాంప్రసాద్ దేవాలయం శేషయ్య లు పాల్గొన్నారు.