తాడ్వాయి, ములుగు, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): సమ్మక-సారలమ్మ నామస్మరణతో మేడారం ఉప్పొంగింది. శివసత్తుల పూనకాలతో అడవి దద్దరిళ్లింది. చీర, సారె, నిలువెత్తు బంగారం(బెల్లం), ఎదురోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరి కాయలు.. తీరొక రూపాల్లో భక్తులు మనసారా మొక్కులు చెల్లించుకొన్నారు. శుక్రవారం ఒకరోజే సుమారు 50 లక్షల మంది తల్లులను దర్శించుకోగా, ఇప్పటివరకు ఈ సంఖ్య కోటికి చేరినట్టు అధికారులు అంచనా వేశారు. పవిత్రమైన మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మకల పున్నమి) రోజున సమ్మక-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుతీరడంతో దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లు, గద్దెల పరిసరాలు భక్తులతో కికిరిసిపోయాయి.
అమ్మల ప్రసాదం(బెల్లం) కోసం పోటీపడ్డారు. పసుపు, కుంకుమ కోసం పరితపించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయ శాఖ అధికారులు.. గద్దెల ప్రాంగణంలో కాకుండా బయటికి వెళ్లే దారిలో భక్తులకు ప్రసాదం అందజేశారు. రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన గిరిజనులు సంప్రదాయ పద్ధతుల్లో అమ్మలకు మొకులు చెల్లించుకొన్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుకాసింగ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మానుకోట ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సిరికొండ మధుసూధనాచారి, బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు తల్లులను దర్శిచుకొని ఎత్తు బెల్లం సమర్పించారు.
నేడు జనాన్ని వదిలి వనంలోకి..
భక్త కోటిని దీవించి, ఆశీర్వదించిన సమ్మక్క శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తుంది. సారలమ్మ కన్నెపల్లికి వెళ్లిపోతుంది. పగిడిద్దరాజు పూనుగుండ్లకు, గోవిందరాజులు కొండాయికి వెళ్లిపోతారు.
దేవతల వనప్రవేశంతో మహా జాతర ముగుస్తుంది.
మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వం
కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతరకు జాతీయ హోదా గుర్తింపు ఉండబోదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సమ్మక్క-సారలమ్మను కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుకాసింగ్తో కలిసి కిషన్‌రెడ్డి దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండేండ్లకు ఒక సారి జరిగే మేడారం జాతరకు జాతీయ హోదా ఉండబదోని చెప్పారు. దేశంలో పండుగలకు జాతీయ హోదా గుర్తింపు ఎక్కడా లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున జాతరకు విస్త్రృత ప్రచారం మాత్రమే కల్పిస్తామని పేర్కొన్నారు.