Saraswati Pushkaralu | మహదేవపూర్(కాళేశ్వరం)/పలిమెల, జయశంకర్ భూపాలపల్లి, మే 17 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు వెళ్లిన భక్తులు ట్రాఫిక్ సమస్యతో విలవిల్లాడుతున్నారు. శనివారం మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు 18 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీగా వచ్చిన ప్రైవేట్ వాహనాలను నియంత్రించకపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తినట్టు భక్తులు చెబుతున్నారు.
సరస్వతీ పుష్కరాలకు లక్షల్లో భక్తులు వస్తారని తెలిసినా అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పుష్కరాల్లో మూడోరోజే ఇలా ఉంటే మిగిలిన తొమ్మిది రోజులు ట్రాఫిక్ సమస్య ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాళేశ్వరం ట్రాఫిక్ వలయంలో చిక్కుకోవడంతో ఎస్పీ కిరణ్, కలెక్టర్ రాహుల్‌శర్మ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు కృషి చేశారు.
కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో గంటల తరబడి లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పుష్కరాల్లో సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్య తలెత్తింది. భక్తుల ఫోన్లు కలువకపోవడంతో బంధువులతో మాట్లాడుకునే పరిస్థితి లేకుండాపోయింది. మూడురోజుల పాటు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అధికారులు తాత్కాలిక సెల్ టవర్స్ ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూశారు. 12 రోజుల పాటు జరిగే సరస్వతీ పుష్కరాల్లో అధికారులు ఎందుకు అలాంటి చర్యలు తీసుకోరని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
కార్తీక మాసం, శివరాత్రి లాంటి పండుగలతో పాటు పుష్కరాల సమయంలో కాళేశ్వర ఆలయంలో దర్శనం చేసుకున్న భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తారు. కానీ కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో సిబ్బంది కొరతతో ప్రసాదం పంపిణీ చేయడంలేదని అధికారులు తెలిపారు. కాళేశ్వరంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో వీఐపీ ఘాట్ వద్ద టెంట్లు, చలువ పందిళ్లు కూలిపోయాయి.
భారీ ఫ్లెక్సీలు విరిగి రోడ్డుపై పడ్డాయి. పారింగ్ స్థలాలు బురదతో నిండిపోవడంతో భక్తులు ఎడ్లబండ్లపై త్రివేణి సంగమానికి చేరుకోవాల్సి వచ్చింది. తేలికపాటి వర్షానికే కాళ్వేరం క్షేత్రమంతా అస్తవ్యస్తంగా మారడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార దంపతులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుణ్యస్నానాలు ఆచరించారు. సరస్వతీఘాట్ వద్ద కాశీ వేదపండితులు నవరత్నమాల హారతి ఇచ్చారు.