మినీ ఇండియాగా పేర్కొనే పటాన్‌చెరుకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి బతుకుదెరువుకోసం వేలాది మంది కార్మికులు వలస వస్తున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తొమ్మిదిన్నరేండ్లలో రూ.9 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటైంది. తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, నాగులపల్లి, కొల్లూర్లలో ఐటీ, సంస్థలు వచ్చాయి. కొల్లూర్‌లో రూ.1,432 కోట్లతో నిర్మిస్తున్న 15,600 డబుల్ బెడ్రూం ఇండ్లు చరిత్రకెక్కనున్నాయి. పటాన్చెరు నియోజకవర్గం 2009లో ఏర్పాటయ్యింది. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఓటమి తెలియని పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఈ రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్‌రెడ్డి జయకేతనం ఎగురవేసి, హ్యాట్రిక్యే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
కేవలం పదేండ్ల కాలంలో రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. ప్రతి గ్రామానికీ కనెక్టివిటీ రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించారు. రామచంద్రాపురం, పటాన్చెరు, అమీన్పూర్, జిన్నారం మండలాల మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు కావడంతో ఈ ప్రాంతం దశ మారింది. అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం, పరిశ్రమల్లో నిరంతరం ఉపాధి లభిస్తుండటం, సూపర్ స్పెషాలిటీ దవాఖాన వస్తుండటం, సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి.
తాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే బీరంగూడ గుట్టపై రెండు రిజర్వాయర్లు నిర్మించారు. అమీన్పూర్ పరిధిలో 10 లక్షల లీటర్ల నీరు నిల్వ సామర్థ్యం కలిగిన మరో రెండు రిజర్వాయర్లు నిర్మాణంలో ఉన్నాయి. రూ.30 కోట్ల అంచనాతో ఒక్కో రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. బొల్లారంలో 25 లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణంలో ఉన్నది.
నియోజకవర్గంలో ఇప్పటికే పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం, రుద్రారం, గండిగూడల్లో పారిశ్రామికవాడలు ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు అమీన్పూర్ మండలం.. సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజ్ పార్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 241.52 ఎకరాల్లో ఏర్పాటైన ఈ పార్క్‌లో 92 యూనిట్లకుగాను ఇప్పటికే 69 యూనిట్లు అనుమతులు పొందాయి. ఇక్కడ రూ.744 కోట్ల పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెడుతున్నారు. వీటి ద్వారా 6,458 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నది. జిన్నారం మండలం.. శివనగర్‌లో ఎల్ఈడీ పార్క్‌ను 66.67 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. 26 పరిశ్రమలు అనుమతి పొందా యి. రూ.328 కోట్లతో పరిశ్రమలను స్థాపించనున్నారు. శివనగర్‌లోని జనరల్ పార్క్‌లో 47 ఎకరాలను కేటాయించారు. రూ.129 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, నాగులపల్లి, కొల్లూర్లలో ఐటీ, అంతర్జాతీయ సంస్థలు వచ్చాయి. పటాన్చెరు, బొల్లారం, పాశమైలారం పాత పారిశ్రామికవాడల్లో మూతపడిన పరిశ్రమలను టేకోవర్ చేసి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఏ పారిశ్రామికవాడలో చూసినా మూడు షిఫ్టులు కొనసాగుతున్నాయి. పారిశ్రామిక కాలుష్యాన్ని నిలువరించేందుకు కామన్ ఇఫ్లూయెంట్ ప్లాంట్‌ను పాశమైలారం ఐడీఏలో నిర్మిస్తున్నారు.
నియోజకవర్గంలోని కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు పేదలకు వరంగా మారాయి. రూ.1,432 కోట్లతో 15,600 డబుల్ బెడ్రూం ఇండ్లను 117 బ్లాక్‌లు, ప్రతి బ్లాక్‌లో లిఫ్టులతో పాటు ఏ ప్లస్ 11 అంతస్తుల చొప్పున నిర్మించింది. 124 ఎకరాల భూమిలో ఇండ్ల నిర్మాణం చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న నిరుపేదల్లో అర్హులకు ఈ ఇండ్లను అందజేస్తారు. వీటితో పాటు మూడు డివిజన్ల ప్రజల కోసం ఆయా ప్రాంతాల్లో రూ.2,439 కోట్లతో చేపట్టిన ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో పూర్తయిన 1,460 ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటికే అందజేశారు.
-అబ్దుల్ అశ్వక్