కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ) : ఆదివాసీ జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. 2016 అక్టోబర్‌లో నూతనంగా ఏర్పాటైన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నది. 2014లో జోడేఘట్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాంతాన్ని రూ.25 కోట్లతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. జిల్లాకు గిరిజన మహిళా డిగ్రీ కళాశాలతోపాటు ఎస్టీ, మైనార్టీ, బీసీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం నూతనంగా ఆరు గురుకుల పాఠశాలు, కళాశాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 56,910 మంది వివిధ రకాల పింఛన్‌దారులు ఉన్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రతినెల దాదాపు రూ.12.75 కోట్లు ఖర్చు చేస్తున్నది.
72శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే
ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు. మాతా, శిశు మరణాలు తగ్గించడానికి, ఆసుపత్రిలో ప్రసవాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో జరిగిన ప్రసవాల్లో 72 శాతం ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా జిల్లా కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు, టీ-హబ్, ఆక్సిజన్ ప్లాంట్ ఎస్ఎన్సీయూ, ఆర్టీపీసీఆర్ ల్యాబ్, ఎన్సీడీ క్లినిక్, డెడికేటెడ్ పీడియాట్రిక్ యూనిట్ ఏర్పాటు చేసింది. జిల్లాకు 330 పడకల ఏరియా ఆసుపత్రిని రూ.9 కోట్లతో మంజూరు చేసింది.
అన్నదాతకు అండగా సర్కారు
రైతుబంధు ద్వారా ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున 2018 నుంచి 2022 వరకు 1,12,693 మంది రైతులకు రూ.1,636 కోట్లు రైతుల ఖాతాల్లో పెట్టుబడి కోసం అందించింది. రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించింది. ఇప్పటి వరకు 1,943 మంది రైతులు చనిపోగా వారి నామినీ ఖాతాల్లో రూ.97.15 కోట్లు జమచేసింది. రుణమాఫీ పథకంలో భాగంగా 2014 లో 54,047 మంది రైతులకు రూ.197.66 కోట్లు, జిల్లాలో 70 క్లస్టర్లలో ఒక్కొక్క రైతు వేదికను రూ.22 లక్షల చొప్పున 70 రైతువేదికలను రూ.15.40 కోట్లతో నిర్మించారు. వ్యయసాయ రంగంలో సాంకేతికతను పెంపొందించే విధంగా 7,396 మంది రైతులకు రూ.9.42 కోట్లతో 195 ట్రాక్టర్లు, 7,201 యాంత్రిక పనియుట్లను రైతులకు పంపిణీ చేశారు. ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల పరిధిలో 2014 నుంచి 2023 వరకు సూక్ష్మ సేద్య పథం ద్వారా 1,130 మంది రైతులకు రూ.2.37 కోట్ల విలువైన బిందు, తుంపర సేద్య పరికరాలను రాయితీపై అందించారు.
కులవృత్తులకు పూర్వవైభవం
జిల్లాలో 2,215 మంది గొల్లకుర్మలకు 75 శాతం రాయితీపై గొర్రెలను ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం ఇప్పటివరకు రూ.9.11 కోట్ల విలువ చేసే గొర్రెల యూనిట్లను అందించారు. రెండో విడుతలో 182 యూనిట్లను అందించారు. మత్స్యకారుల సంక్షేమానికి 100 సబ్సిడీతో జలవనరుల్లో చేప పిల్లలను యేటా వేస్తోంది. జిల్లాలోని 251 చెరువులు, నాలుగు రిజర్వాయర్లు, 10 పెద్ద చెరువుల్లో 137.115 కోట్ల చేప పిల్లలు వేశారు. 5 వేల మత్స్యకారుల కుటుంబాలు దీని ద్వారా లబ్ధి పొందుతున్నాయి.
మెరుగైన రవాణా సౌకర్యం
రహదారులు, భవనాల శాఖ ద్వారా రూ.981 కోట్లతో దాదాపుగా 121 పనులను చేపట్టింది. ఆసిఫాబాద్ నుంచి తిర్యాణికి రెండు వరుసల రహదారికికి రూ.38 కోట్లు, జైనూర్ నుంచి మామిడిపల్లి రోడ్డుకు రూ.7 కోట్లు, జిల్లాలోని వివిధ గ్రామాలను కలుపుతూ రవాణా సౌకర్యం కల్పించేందుకు రూ.52 కోట్లు ఖర్చు చేసింది. పంచాయతీరాజ్‌శాఖ ద్వారా సుమారు రూ.250 కోట్లతో రవాణా వసతులు లేని గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. చింతలమానేపల్లి మండలంలోని ప్రాణహిత నదిపై రూ.65 కోట్లతో వంతెన నిర్మాణాన్ని చేపట్టడంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు పెరిగాయి.
ఎస్పీఎంతో పారిశ్రామిక అభివృద్ధి
2014లో మూతపడిన సిర్పూర్ పేపర్‌మిల్లును ప్రభుత్వం 2018లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. పరిశ్రమ పునఃప్రారంభానికి అనేక రాయితీలను కల్పించింది. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 1500 మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
గిరిజన, దళితుల సంక్షేమానికి కృషి
గిరిజన రైతుల భూములకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాలో గిరివికాసం పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా 119 మంది రైతులకు వంద శాతం సబ్సిడీతో బోర్లను వేసి సాగునీటి వసతి కల్పించింది. జిల్లాలో 177 మందికి దళితబంధు పథకం ద్వారా రూ.17.70 కోట్లు అందించింది.