శంకర్పల్లి జూన్ 20 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారె రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణలో రూ.2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌కు భూమి పూజ చేశారు.
బుల్కపూర్ వార్డులో కోటి రూపాయలతో స్మశాన వాటిక, రూ.10 కోట్లతో మున్సిపాలిటీ పరిధి లోని అన్ని వార్డులలో భూగర్భ మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 11 వ వార్డులో ఎంపీ నిధులు రూ.13.60 లక్షలతో వేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాల రూపు రేఖలు మరాయని కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అయ్యారన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని పేర్కొన్నారు. పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ,ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ గోవిందమ్మ, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.