హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్‌లోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో (క్యూర్) సర్కార్ స్కూళ్ల అభివృద్ధికి రూ.1,011.65 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. దీంట్లో 30% నిధులు సర్కార్ లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్సార్) ద్వారా సమకూరుస్తాయి. 70% నిధులు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) రుణం ద్వారా సమకూరుస్తారు. 496.75 కోట్లతో 11 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలు నిర్మించనుండగా, రూ. 364.60 కోట్లతో 17 స్కూళ్లను అప్‌గ్రేడ్ చేస్తారు. రూ. 150.30 కోట్ల అంచనా వ్య యంతో 164 బడుల్లో 501 అదనపు తరగతి గదులను నిర్మిస్తారు. ఒక్కో అదనపు తరగతి గదిని రూ.30లక్షలతో నిర్మించనున్నారు.
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : రెండు దశాబ్దాలుగా నష్టపోతున్న 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ పునరుద్ధరించాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ డిమాండ్ చేశారు. దరఖాస్తులిచ్చినా.. ధర్నాలు చేసినా.. విజ్ఞాపనలు, వినతిపత్రాలిచ్చినా తమ డిమాండ్‌ను అమలుచేయకపోవడం శోచనీయమని ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం రెండు మెమోలిచ్చినా.. హైకోర్టు తీర్పులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తాత్సారం చేయడం గర్హనీయమని మండిపడ్డారు. 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ వర్తింపజేయడం ద్వారా సర్కార్‌కు వచ్చిన నష్టమేదీలేదని స్పష్టంచేశారు. సోమవారం జరుగబోయే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించి, పాత పింఛన్ వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.