కరీంనగర్ : జిల్లాలోని మానేరు ఫ్రంట్‌ను దేశంలోనే పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆస్ట్రేలియా కు చెందిన లేజర్ విజన్ కంపెనీ, ఇండియాలోని ఎఫ్‌పీఏ కంపెనీల ప్రతినిధుల బృందానికి మానేరు రివర్ ఫ్రంట్‌లో నిర్మించే వాటర్ ఫౌంటెన్ లేజర్ షో, హంపి థియేటర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు.
అనంతరం మానేరు రివర్ ఫ్రంట్ ప్రాంతాన్ని ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందంతో కలిసి మంత్రి గంగుల సందర్శించారు. వాటర్ ఫౌంటెన్ లేజర్ షోకు అనువైన ప్రదేశాన్ని సర్వే చేసి త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే సివిల్ వర్క్ పనులు ప్రారంభింmచామని..భారీ వర్షాల నేపథ్యంలో పనులు మందగించాయన్నారు.
రానున్న వేసవికాలం వరకు పనుల్లో వేగం పెంచి యేడాదిన్నరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పరిసరాలను సుందరీకరించేందుకు పర్యాటక శాఖ నుంచి రూ. 100 కోట్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్ పాల్గొన్నారు.