వరంగల్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ జల ప్రదాత, సీఎం కేసీఆర్ కృషితోనే దేవాదుల ప్రాజెక్టు పూర్తవుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని ప్రతి చెరువు నిండేలా, ప్రతి ఎకరం పండేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో పని చేస్తున్నారని చెప్పారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లో మంత్రి సత్యవతిరాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ తో కలిసి మంత్రి దేవాదుల పనుల పురోగతిపై సమీక్షించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. దేవాదుల చివరి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. యాసంగి సీజన్ మొదలయ్యేలోపు పెండింగ్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు.