హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలో వెలుగు చూసిన యూ-బిట్ కాయిన్ దందా వివరాలను ఆ జిల్లా ఎస్పీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు అందజేసినట్టు తెలిసింది. ఈ ఆన్లైన్ మోసంలో తీగలాగితే ఒక్కొక్కరి డొంకలు కదులుతున్నాయి. ఏడాదిన్నరగా సాగుతున్న ఈ దందాకు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మధ్యవర్తులుగా వ్యవహరించడం మొదట్లోనే చర్చనీయాంశమైంది. దీంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఒక్క నిర్మల్ జిల్లాలోనే దాదాపు 60 మందికిపైగా మధ్యవర్తులు ఉన్నట్టు దర్యాప్తులో తేల్చారు. మొదట బోథ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని విచారించిన పోలీసులు.. ఆ తర్వాత కడెం, ఖానాపూర్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన 8 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ నిర్మల్‌లో కాకుండా వేరే పోలీస్ స్టేషన్లో రహస్యంగా విచారించారు. నిర్మల్పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లోనూ కొనసాగిన ఈ దందాలో 1,500 మందికిపైగా బాధితులు ఉన్నట్టు అధికారులు అంచనాకు వచ్చారు.
ఈ దందాలో మనీ లాండరింగ్ జరిగిందని ప్రాథమికంగా అనుమానిస్తున్న ఈడీ.. మరిన్ని వివరాల కోసం లోతుగా కూపీ లాగుతున్నది. ఒక నిర్మల్ ప్రాంతంలోనే దాదాపు రూ.50 కోట్లు కొల్లగొట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలడంతో ఆ డబ్బును ఎకడికి తరలించారు? ఏం చేశారు? అన్న వివరాలను రాబట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నది. రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.14 వేల చొప్పున వడ్డీ వస్తుందని, రూ.5 వేలు పెట్టుబడి పెట్టినా 500 రోజుల్లో రెట్టింపు చేస్తామని ఈ ముఠా నమ్మబలుకుతూ.. ఒక్కో పెట్టుబడిదారు మరో ఐదుగురిని చేర్పించాలని గొలుసుకట్టు వ్యాపారానికి తెరలేపింది. దుబాయ్‌లో ఉన్న ఈ ముఠా సూత్రధారులు ఢిల్లీలో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని ఈ దందాను సాగించారని, తద్వారా కొల్లగొట్టిన డబ్బంతా దుబాయ్‌కే తరలించి ఉంటారని ఈడీ అనుమానిస్తున్నది.