BRS | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని దాదాపు ఏ ప్రాంతం నుంచి అయినా హైదరాబాద్‌కు ప్రజలు గంటలో చేరుకొనేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కొత్తగా తొమ్మిది మార్గాల్లో తెలంగాణ ర్యాపిడ్ ట్రాన్సిట్ (టీఆర్టీ) వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేసింది. 792 కిలోమీటర్ల టీఆర్టీ మార్గం నిర్మించేందుకు రూ.55,440 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే ఈ ప్రాజెక్టుపై ఇటీవలే పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పట్టణీకరణ నేపథ్యంలో ఢిల్లీ పరిధిలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో కేంద్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్)ను చేపట్టింది. రూ.1,66,000 కోట్లతో ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ర్టాల్లోని పట్టణ ప్రాంతాలను కలుపుతూ అత్యంత వేగవంతమైన రైల్వే వ్యవస్థను తలపెట్టింది.
అదే తరహాలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి తెలంగాణ నలుమూలలా వెళ్లేందుకు అత్యంత వేగవంతమైన ప్రజా రవాణా వ్యవస్థగా తెలంగాణ ర్యాపిడ్ ట్రాన్సిట్ (టీఆర్టీ) వ్యవస్థను తీసుకురానున్నది. ఇందుకోసం సుమారు రూ.55,440 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న రైలు, బస్సులు, మెట్రో, కార్లు వంటివే కాకుండా పర్యావరణహితమైన, అత్యంత వేగవంతమైన టీఆర్టీ వ్యవస్థను తెలంగాణలో నిర్మించేందుకు తొమ్మిది మార్గాలను ఎంపిక చేశారు. హైదరాబాద్ నగరంపై భారం పడకుండా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా గంట వ్యవధిలో హైదరాబాద్‌కు చేరుకొనే అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థగా టీఆర్టీని సిద్ధం చేశారు. ఇది కార్యరూపం దాల్చితే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాల నుంచి గంటలోనే ప్రజలు హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 158 కి.మీ పొడవున ఉన్న ఔటర్ రింగు రోడ్డు నుంచి భూ ఉపరితలంపైనే టీఆర్టీ రైల్వే మార్గాన్ని నిర్మించనున్నారు. దీనిపై రైళ్లు గంటకు అత్యధికంగా 180 కి.మీ వేగంతో, సరాసరిన 100 కి.మీ వేగంతో రాకపోకలు సాగిస్తాయి. ఇందుకోసం కిలోమీటర్‌కు రూ.70 కోట్ల చొప్పున 9 మార్గాల్లో 792 కి.మీ మేర టీఆర్టీ మార్గం నిర్మించేందుకు రూ.55,440 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అవకాశం కూడా ఉన్నది. ఓఆర్ఆర్ చుట్టూ కొత్తగా మెట్రో నోడల్ పాయింట్లను గుర్తించి అక్కడి నుంచి 9 మార్గాల్లో టీఆర్టీ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రాథమిక నివేదికను ప్రభుత్వం రూపొందించింది. ఈ ప్రాజెక్టును ప్రజా రవాణా వ్యవస్థలోనే విప్లవాత్మక చర్య సర్కారు భావిస్తున్నది.
1. శామీర్‌పేట ఓఆర్ఆర్ నుంచి గజ్వేల్, కొమరవెల్లి, సిద్దిపేట, కరీంనగర్ (140 కి.మీ) రూ.9800 కోట్లు.
2. ఘట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి మొదలై బీబీనగర్, భువనగిరి, యాదాద్రి, జనగామ, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ (113 కి.మీ) రూ.7910 కోట్లు.
3. పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్ నుంచి చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నల్లగొండ (81 కి.మీ) రూ.5670 కోట్లు.
4. నార్కట్‌పల్లి నుంచి నకిరేకల్ మీదుగా సూర్యాపేట, కూసుమంచి, ఖమ్మం (111 కి.మీ). రూ.7770 కోట్లు.
5. శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి షాద్‌నగర్, బాలానగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్ (50 కి.మీ) రూ.3500 కోట్లు
6. తెలంగాణ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) ఓఆర్ఆర్ నుంచి మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్ (60 కి.మీ). రూ.4200 కి.మీ
7. ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి ఇస్నాపూర్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ (64 కి.మీ). రూ.4480 కోట్లు.
8. కండ్లకోయ ఓఆర్ఆర్ నుంచి మేడ్చల్-మనోహరాబాద్, మాసాయిపేట, చేగుంట, మెదక్ (70 కి.మీ)రూ.4900 కోట్లు.
9. చేగుంట నుంచి రామాయంపేట, బికనూర్, కామారెడ్డి, ఇందల్వాయి, డిచ్పల్లి, నిజామాబాద్ వరకు (103 కి.మీ) రూ.7210 కోట్లు.
