హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రపంచానికి ప్రస్తుతం అణ్వాయుధాలతోకంటే వాతావరణ మార్పులతోనే అధిక ముప్పు ఉన్నదన్న భయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితితోపాటు అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా వాతావరణ మార్పుల దుష్ప్రభావాలపై ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాయి. వాయు, జల, నీటి, శబ్ద కాలుష్యాలతో మానవ మనుగడకే ముప్పు రాబోతున్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకొంటున్నప్పటికీ వ్యక్తిగతంగా ప్రతి పౌరుడూ బాధ్యత తీసుకోవాలనే అవగాహన పెరుగుతున్నది. ఈ పనిని 11 ఏండ్లుగా నిర్విరామంగా చేసి చూపిస్తున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఓ టెకీ.
రోజూ 54 కిలోమీటర్లు సైకిల్‌పైనే
ఐటీ కారిడార్‌లోని ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేసే టెకీ ప్రణయ్ ఉపాధ్యాయ గత 11 ఏండ్లుగా సైకిల్‌నే ప్రయాణ సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి నగరానికి వచ్చి స్థిరపడిన ఆయన దుండిగల్ నుంచి హైటెక్‌సిటీ వరకు రోజూ ఆఫీస్‌కు వచ్చిపోయేందుకు సైకిల్‌నే ఉపయోగిస్తున్నారు. ఇలా రోజులో సగటున 54 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇతరులను కూడా చైతన్యవంతులను చేసేందుకు తన శరీరానికే ప్లకార్డులు తగిలించుకొని కార్లు, ఇతర వాహనాలు వాడటం తగ్గించాలని ప్రచారం చేస్తున్నారు. ఆయన కుమారుడు బుద్ధిమాంద్యంతో జన్మించటానికి వాయుకాలుష్యమే కారణమని కొన్నేండ్ల క్రితం డాక్టర్లు చెప్పటంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు తనవంతుగా కృషిచేస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి సైకిలే ఆయన వాహనం అయ్యింది. రోజూ సైకిల్ తొక్కడంవల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని, ఇంధన ఖర్చుల బాధ తప్పుతుందని చెప్తున్నారు.
కమ్యూనిటీ సైకిల్ రూపకల్పన
సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణం చేయాలని కోరిక ఉన్నా హైదరాబాద్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రమాదాల భయంతో వెనుకాడేవారికి ప్రణయ్ ఉపాధ్యయ ఓ చక్కని మార్గం చూపించారు. ఏడుగురు వ్యక్తులు ఒకేసారి సైకిల్ తొక్కుతూ హాయిగా ప్రయాణించేలా కమ్యూనిటీ సైకిల్‌ను తయారు చేశారు. నాలుగు చక్రాలతో ఉండే ఈ సైకిల్‌పైన సోలార్ ప్యానల్స్ అమర్చి అవసరమైనప్పుడు బ్యాటరీతో కూడా నడిపేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం దీనిని తన కుటుంబం ప్రయాణించేందుకు వాడుతున్నారు. కమ్యూనిటీ సైక్లింగ్‌పై త్వరలో పలు కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో విస్తృతంగా ప్రచారం చేయనున్నట్టు చెప్పారు. ప్రణయ్ ఉపాధ్యాయ ప్రయత్నాన్ని పర్యావరణ ప్రేమికులు అభినందిస్తున్నారు.