హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లు చెల్లించి న్యాయం చేయాలని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్ దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సకాలంలో బెనిఫిట్లు చెల్లించనందువల్ల 39మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించార ని వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల సర్కార్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా 42 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర ఉందని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని గుర్తుచేశారు.
రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిపై ఇక సహించేది లేదని హెచ్చరించారు. అంతకుముందు ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు అందజేసే విషయంలో ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదని విమర్శించారు. తన అసమర్థతను గత ప్రభుత్వంపై రుద్దాలని ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో ఉద్యోగుల జీవన విధానాలలో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. వచ్చే సర్కార్ తమదే అని, అప్పుడు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు.