హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హైడ్రా ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయదని, దాని గురించి బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ, టౌన్‌ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని వివరించారు. హైడ్రా సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ, పారులు, సరస్సులు ఆక్రమణలు కాకుండా చూస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ టీకే శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.