Runa Mafi | ఖమ్మం, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పాలకుల మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం రైతుల గడపకు కూ డా చేరడం లేదు. రుణమాఫీ ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత గ్రామమైన వైరా నియోజకవర్గంలోని స్థానాల లక్ష్మీపురంలోనూ అనేకమంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ గ్రామంలో మొత్తం 232 మంది రైతులు రుణమాఫీకి అర్హులు కాగా కేవలం 94 మందికే రుణమాఫీ దక్కింది. మిగిలిన 138 మందికి స్వల్ప కారణాలను సాకుగా చూపిస్తూ మాఫీ చేయలేదు. దీంతో గత 4 రోజులుగా వైరాలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి రుణమాఫీ కోసం మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. వైరా మండలం గొల్లపూడి, రెబ్బవరం, పుణ్యపురం, పినపాక, సోమవరం వంటి గ్రామాల్లో అనేకమంది రైతులకు రుణమాఫీ కాలేదు.
మాఫీకాకపోతే ఇబ్బందులే..
నాకున్న రెండెరాల పొలానికి బ్యాంకు నుంచి రూ.90 వేల రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా రూ.2 లక్షల రుణమాఫీలో నా పేరు లేదు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా. ప్రభుత్వం మాఫీ చేయకపోతే మరిన్ని కష్టాల్లో పడతాను. ప్రభుత్వం మా లాంటి పేదలను ఆదుకునేందుకు వెంటనే రుణమాఫీ చేయాలి.
-అమ్మిక కృష్ణయ్య, రైతు, స్నానాల లక్ష్మీపురం, వైరా నియోజకవర్గం
డిప్యూటీ సీఎం ఊర్లో అంతంత మాత్రమే..
నేను బ్యాంకులో రూ.2 లక్షలు రుణం తీసుకున్నా. రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు. ఉప ముఖ్యమంత్రి స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో కూడా రుణమాఫీ అంతంతమాత్రంగానే జరిగింది. తక్షణమే ఆయన స్పందించి గ్రామంలో రుణం తీసుకున్న అందరికి మాఫీ చేయాలి. అప్పుడే రైతులకు న్యాయం జరిగినట్టు అవుతుంది.
-అమ్మిక రామారావు, మాజీ సర్పంచ్, స్నానాల లక్ష్మీపురం, వైరా నియోజకవర్గం