హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు నాలుగోరోజూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ప్రమాదం జరిగి 72 గంటలు దాటినా వారి ఆచూకీ లభించలేదు. ప్రమాద స్థలాన్ని కనుగొనడం సాధ్యపడటం లేదు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి సహాయక బృందాలు రేయింబవళ్లు సహాయక చర్యల్లో నిమగ్నమైనప్పటికీ ఎలాంటి ముందడుగు పడటంలేదు. మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఘటనా స్థలంలోనే ఉండి రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) దోమలపెంటకు బయల్దేరారు. మరికాసేపట్లో టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షంచనున్నారు. అయితే ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లకపోవడం, బాధిత కుటుంబాల్లో భరోసా నింపకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది.
కాగా, సొరంగం నుంచి ఉబికి వస్తున్న నీరు, బురద సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి. ఫలితంగా లోపలికి రెస్క్యూ బృందం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మద్రాస్ ఐఐటీ నిపుణులు తీసుకొచ్చిన ప్రోబ్ కెమెరాలతో పాటు.. అత్యాధునిక టెక్నాలజీతోపాటు హై రిజల్యూషన్ కలిగిన ఆక్వా ఐ కెమెరాలను లోపలికి పంపించారు. డ్రోన్ కెమెరాలను ఉపయోగించినా ఫలితం కనిపించలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఒక బృందం వెళ్లినా.. అక్కడ బురద, నీళ్లు మిషనరీ వల్ల తిరిగి వెనక్కి వచ్చారు. ఏ సమయంలోనైనా లోపలున్నవారిని గుర్తించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఐదు అంబులెన్స్‌లను, డాక్టర్ల బృందాన్ని సిద్ధంగా ఉంచింది. హై రిజల్యూషన్ రిమోట్ కెమెరాలను పంపించి ఘటనా స్థలం మొత్తం రికార్డింగ్ చేయిస్తున్నారు.
ఆక్వా ఐ.. ఫ్లెక్సీ ప్రోబ్ పరికరాలపైనే ఆశలు
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు అత్యాధునిక పరికరాలను వా డుతున్నారు. మద్రాస్ ఐఐటీకి చెందిన సాంకేతిక నిపుణుల సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ చేయనున్నారు. ఐఐటీ నిపుణులు ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఆక్వా ఐ కెమెరా హై రిజల్యూషన్‌తో కూడినది. ఇది నీటిలో సుమారు 50 మీటర్ల చుట్టుపక్కల ఉన్న వాటిని గుర్తిస్తుంది. బురదలో ఏ చిన్న వస్తువు ఉన్నా రికార్డ్ చేస్తుంది. ఈ కెమెరాతో లోపల చిక్కుకున్నవారి పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు… ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్‌కు ఇది తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రోబ్ కెమెరా లోపలికి పంపించి ఆ చిత్రాల ఆధారంగా ఏం చేయాలన్న దానిపై నిపుణులు ఇచ్చిన సూచనలను పాటించి రెస్క్యూ చేసే అవకాశం ఉంది. మరోవైపు హై రిజల్యూషన్ కలిగిన కెమెరాలను కూడా పంపిస్తున్నారు.
విమర్శలతో వేగంగా సహాయక చర్యలు
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తుండటంతో ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. దాదాపు మూడ్రోజుల తర్వాత మేల్కొన్న సర్కారు అందుబాటులో ఉన్న ఇతర చోట్ల జరిగిన ప్రమాదాలను గుర్తించి విజయవంతం చేసిన బృందాలను రప్పిస్తున్నది. ముందుగా ఖర్చుకు వెనకాడినా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సింగరేణితో ఫలితం లేదని భావించి ఇతర నిపుణులను రంగంలో దించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని బృందాలను సమన్వయం చేస్తూ ముందుకుసాగితే చిక్కుకున్నవారిని రక్షించడంతోపాటు.. సొరంగ మార్గంలో షియర్ జోన్‌ను గుర్తించి ముందుకు వెళ్లొచ్చని నిర్ణయానికి వచ్చారు.