హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): తమ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ అంశమే లేదని, అందరం కలిసి టీంవర్క్ చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. మంత్రులకు సైతం ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో జాతీయ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. తమ ప్రభుత్వ హ యాంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవ ని, 100% రుణమాఫీ చేశామని, పూర్తిగా రైతుభరోసా ఇచ్చామని, ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామని, పేదలకు ఇండ్లు, రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు. సన్నం బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సక్సెస్ అయ్యాయని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ తమ ప్రభుత్వం హయాంలో పూర్తి అవుతుందని, రీజినల్ రింగ్ రోడ్డు కూడా వస్తుందని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సరార్ వచ్చేది లేదని స్పష్టంచేశారు.
వారికి పదోన్నతులు ఎలా ఇస్తారు?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల చావుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా వారికి పదోన్నతులు, ప్రోత్సాహకాలు అందించిన బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవా రం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ఇందిరాభవన్‌లో ఏఐసీసీ, ఎస్సీ వింగ్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ నాడు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదుచేయించిన నాటి ఎమ్మెల్సీ రామచంద్రరావు ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని, రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న సుశీల్‌కుమార్‌ను ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారని విమర్శించారు. రాహుల్‌గాంధీ చెప్పినట్టుగానే రోహిత్ వేముల చట్టాన్ని త్వరలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుందని తెలిపారు.