హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, విశ్లేషణ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అన్నారు. ఈ సర్వే సమాచారం ఆధారంగా స్వతంత్ర మేధావుల కమిటీ చేసిన అధ్యయనం చారిత్రాత్మకమైనదని చెప్పారు. కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కులగణన కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఇంతమంది రెడ్లు ఉన్నప్పటికీ ఎలాంటి భేదాలు లేకుండా అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని బాధ్యతతో పనిచేశారని అన్నారు. ఫలితంగా సర్వే నిర్వహణ, విశ్లేషణ కార్యక్రమంలో విజయవంతమయ్యామని తెలిపారు.
హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో శనివారం నిర్వహించిన తెలంగాణ సామాజిక, ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే-2024 (ఎస్ఈఈఈపీసీ) నివేదిక సమర్పణ సమావేశంలో భట్టి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రముఖులు, ఎలాంటి ముద్రలు లేని వివాదరహితులను సర్వే కమిటీ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఇలాంటి సర్వే దేశంలో ఇప్పటివరకు ఎకడా జరగలేదని అన్నారు. కుల సర్వేపై క్యాబినెట్ సీరియస్‌గా చర్చించి, ప్రశ్నపత్రాలు రూపొందించి, లెకింపు, బ్లాక్‌ల ఏర్పాటు అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ముగించుకొని సర్వే నిర్వహించామని తెలిపారు. కుల సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెడితే సభ్యులు అనేక రకాల ప్రశ్నలు అడిగారు తప్ప లోపం ఉన్నదని ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు. విలువైన సమయాన్ని కేటాయించి నివేదికను విశ్లేషించిన మేధావులకు ధన్యవాదాలు తెలిపారు. వారి సూచనలను ప్రభుత్వం కచ్చితంగా వినియోగించుకుంటుందని భట్టి పేర్కొనారు.