Mallu Batti Vikramarka | మీరు బిల్లు చెల్లించాలి కానీ ఫుడ్ ఆర్డర్ చేయలేరు అన్న తరహాలో యు జి సి కొత్త నిబంధనలు ఉన్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం తిరువనంతపురంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యారంగంలో స్వయం ప్రతిపత్తి కావాలన్నారు. యూజీసీ ముసాయిదా నిబంధనల ప్రభావం, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, తెలంగాణలో విద్యారంగంలో చేపట్టిన కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం ప్రసంగించడంతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలకు నిధులు సమకూర్చడంతోపాటు నిర్వహించాలని మాత్రమే కేంద్రం భావిస్తున్నట్లు యూజీసీ నిబంధనలు ఉన్నాయని మల్లు భట్టి విక్రమార్క మండి పడ్డారు. ఆయా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం మొదలు అడ్మిషన్ల వరకు కీలక నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగిస్తున్నారని విమర్శించారు. ఈ విధానం అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు భవనాలు ప్రారంభించే రిబ్బన్ కటింగ్ అధికారానికి మాత్రమే పరిమితమవుతాయన్నారు. విద్యారంగం కేంద్రం గుత్తాధిపత్యం కాదని ఉమ్మడి జాబితాలోని అంశం అని గుర్తు చేశారు.
ఆయా రాష్ట్రాలు తమ వ్యవస్థలు, ప్రజలకు అవసరమైన విద్యాసంస్థలను నిర్మించుకుంటాయని, ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి పోలిక ఉండదని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. స్వయం ప్రతిపత్తి లేకుండా నాణ్యమైన విద్యను ఏ రాష్ట్రమూ అందించలేదని స్పష్టం చేశారు. ఇంతటి ప్రాధాన్యం గల అంశంపై చర్చలకు పరిమితం కాకుండా అంతా కలిసి నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలు ఒక ఉమ్మడి లక్ష్యంతో ఐక్యమైనప్పుడు కేంద్రం తప్పక వినాలని పేర్కొన్నారు. రాష్ట్రాలు కేవలం పరిపాలన విభాగాలుగా మాత్రమే కాదు అవి ఈ దేశ పురోగతికి జీవనాడి వంటివి అన్నారు. రాష్ట్ర విద్యార్థుల నాడి, అక్కడ యువత ఆకాంక్షలు, అధిగ మించాల్సిన ప్రత్యేక సవాళ్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయన్నారు.
విద్యావ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నడపలేమని మల్లు భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. రాష్ట్రాల అవసరాలకనుగుణంగా విద్యా విధానాలను రూపొందించాలన్నారు. సహకారం అంటే బలవంతం కాదు సంప్రదింపులని, కేంద్రం నిజంగా సహకార సమాఖ్య వాదాన్ని విశ్వసిస్తే చర్చించాలన్నారు.
రాష్ట్రాలు ఐక్యంగా గళం విప్పితే ఆ ప్రతిధ్వనులు ఎంత దూరమైనా చేరుతాయని చరిత్ర మనకు చెబుతుందన్నారు. ఈ సదస్సులో కేరళ సీఎం పినరయి విజయన్, కేరళ ఉన్నత విద్య శాఖ మంత్రి ఆర్ బిందు, కర్ణాటక మంత్రి ఎంసీ సుధాకర్ అవారే, తమిళనాడుకు చెందిన తిరు గోవి చేజియాన్, పంజాబ్ మంత్రి సర్దార్ హరోజ్ సింగ్‌తోపాటు ప్రముఖ విద్యావేత్తలు పాల్గొన్నారు.