హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆదాయ వనరుల అన్వేషణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. సచివాలయంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ఆయ న సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వ్యయాల గురించి మంత్రికి అధికారులు వివరించారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, అభయహస్తం మ్యానిఫెస్టో హామీలను నెరవేర్చేందుకు ఆదాయాన్ని పెంచేలా మనస్ఫూర్తిగా పనిచేయాలని కోరారు.
రాష్ర్టాభివృద్ధికి పనిచేస్తున్నామన్న భావనతో విధులు నిర్వర్తిస్తే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. ప్రభుత్వ పథకాలను ఉచితాలుగా చూడొద్దని, మానవ వనరులపై పెట్టుబడిగా భావించాలని సూచించారు. సమీక్షలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కార్యదర్శి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.