హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థికసాయంగా రూ.76,312 కోట్లు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు రూ14,100 కోట్లు, రేడియల్ రోడ్ల నిర్మాణానికి రూ.45,000 కోట్లు, హైదరాబాద్‌లో మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధికి రూ.17,212 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర బడ్జెట్‌కు ముందస్తుగా శనివారం న్యూఢిల్లీలోని అశోకా హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టును వెంటనే గాడిలో పెట్టాలని, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సానుకూల నిర్ణయం తీసుకుని త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు.
హైదరాబాద్‌లో ఐఐఎం, మిగిలిన జిల్లాల్లో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతోపాటు పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు ఇస్తున్న 50 ఏండ్ల వడ్డీరహిత రుణాలను గ్రాం ట్లుగా మార్చాలని, ఆ సహాయాన్ని రెట్టింపు చేయాలని కోరారు. పన్నుల ద్వారా కేంద్రానికి వస్తున్న రాబడిలో సెస్‌లు, సర్‌చార్జీల వాటా 20 శాతానికి చేరిందని తెలిపారు. దాదాపు రూ.1,55,000 కోట్ల సర్‌చార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలని, లేదంటే రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని భట్టి విజ్ఞప్తి చేశారు.