హైదరాబాద్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సోమవారం ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఇటీవల జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన భట్టి విక్రమార్క.. అక్కడ తాను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా ఖర్గేకు నివేదించారు.
జార్ఖండ్‌లో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో తాను జరిపిన చర్చల వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధినేతకు వివరించారు.
రాజ్యసభ ఎన్నికల్లో ‘ఇండియా’ (INDIA) కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఆయన ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు.
రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగడంపై జార్ఖండ్ స్థానిక నాయకత్వంతో జరిపిన సంప్రదింపులను భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ప్రస్తావించారు. కూటమి ఐక్యతను చాటేలా జార్ఖండ్ కాంగ్రెస్ నేతలు శ్రమిస్తున్న తీరును ఆయన ఏఐసీసీ అధ్యక్షునికి వివరించారు.