హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా యువతకు తోడ్పాటు అందించేందుకు బ్యాంకర్లు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార సూచించారు. బుధవారం జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో యువ వికాసం పథకం అమలుపై బ్యాంకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,000 కోట్లు ఖర్చు పెడుతుందని, బ్యాంకర్లు రూ.1,600 కోట్లు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ పథకం అమలయ్యేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
సంపన్నుల ఆస్తులను జాతీయం చేయాలి ; లెనిన్‌బాబు డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): దేశంలోని వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్న సంపన్నులు, బడావ్యాపారస్తుల ఆస్తులను జాతీయం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీయ కార్యదర్శి లెనిన్‌బాబు డిమాండ్ చేశారు. యువతను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బుధవారం ఏఐవైఎఫ్ రాష్ట్ర కన్వెన్షన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ సంపన్నులు దేశాన్ని అన్ని రకాలుగా దోచుకుని ఆర్థికంగా లాభపడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలపై ఉన్న శ్రద్ధ.. నిరుద్యోగ యువతపై లేదని విమర్శించారు. 2023లో కార్పొరేట్ పన్ను 30 నుంచి 22శాతానికి ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వెంకటేశ్వర్లు, లింగం రవి, బిజ్జ శ్రీనివాసులు, యుగంధర్, పేరబోయిన మహేందర్, రాష్ట్ర సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.