హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ స్టోరీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ స్టోరీలో రాధాకృష్ణ తనపై ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఈ 40 ఏళ్లలో తాను సమాజం మేలు కోసమే పనిచేశానని చెప్పారు. రాజకీయాల కోసం దిగజారుడు కథనాలు సృష్టించి, ప్రచారం చేసేంత వీక్ క్యారెక్టర్ తనది కాదని అన్నారు.
తన మీద అబద్ధాలు రాసిన ఏబీఎన్ రాధాకృష్ణకు ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చునని భట్టి అన్నారు. లేదంటే తాను మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి సన్నిహితంగా ఉండేవాడినని, ఇప్పుడు ఆయన మీద కోపం రాధాకృష్ణ తనపై చూపించడానికి తప్పుడు కథనం రాసి ఉండొచ్చని చెప్పారు. కానీ తాను రాధాకృష్ణలా ఏదిపడితే అది మాట్లానని, ఏదీ పడితే అది రాయనని, ఎందుకంటే తనకు బాధ్యత ఉన్నదని వ్యాఖ్యానించారు.
రూ.1600 కోట్ల నైని కోల్ బ్లాక్ గనుల టెండర్ల కోసం గొడవ పెరిగి పెద్దదై ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ వరకు వెళ్లిందని రాధాకృష్ణ తన వీకెండ్ స్టోరీలో పేర్కొన్నారు. ఆ టెండర్ల రద్దు కారణంగానే మహిళా ఐఏఎస్ అధికారిణికి మంత్రితో సంబంధాలు అనే కథనం ఎన్టీవీలో ప్రచారం అయ్యిందని రాసుకొచ్చారు. దీని వెనుక భట్టి విక్రమార్క ఉన్నట్లు అనుమానం వ్యక్తంచేశారు.
దాంతో రాధాకృష్ణ ఆరోపణలను భట్టి విక్రమార్క తప్పుపట్టారు. తన మీద ఆరోపణలు వచ్చినందుకే నైని కోల్ బ్లాక్ గనుల టెండర్లను క్యాన్సిల్ చేశానని, మళ్లీ కొత్త టెండర్లు వేయండని సింగరేణి సంస్థకు చెప్పానని తెలిపారు. ఈ విషయంపై సాయంత్రం మళ్లీ మాట్లాడుతానని ఆయన అన్నారు.